వ్యాధుల నివారణకు తక్షణమే స్పందించాలి

ఎన్‌వీబీడీసీపీ రాష్ట్ర పీఓ ప్రభావతి


ఆదిలాబాద్‌(ఆరోగ్యజ్యోతి) : త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఎన్‌వీబీడీసీపీ రాష్ట్ర స్థాయి కార్యక్రమ అధికారిణి ప్రభావతి సూచించారు. ఆమె శనివారం జిల్లాకు వచ్చిన సందర్భంగా రిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించి వ్యాధుల నిర్ధరణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, కార్యక్రమ అధికారులు, సబ్‌ డివిజనల్‌ అధికారులతో సమావేశమై వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో వ్యాధుల నివారణకు రూపొందించిన ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, ప్రజారోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నందున ఎక్కడ ఎలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయో తెలుసుకోవటం సులువుగా మారిందన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకొని మలేరియా, డెంగీ, కరోనా వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలుతున్నట్లు అనుమానిస్తే సంబంధిత వైద్యాధికారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. సమావేశంలో ఎన్‌వీబీడీసీపీ రాష్ట్ర కన్సలెటంట్ సంజీవ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ తొడ్సం చందు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సాధన, కార్యక్రమ అధికారులు ఎం.శ్రీకాంత్‌, ఈశ్వర్‌రాజ్‌, వైసీ శ్రీనివాస్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.