జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు పది పరీక్షలు

హైదరాబాద్‌,: కరోనా కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదోతరగతి పరీక్షలను ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు నిర్వహించనున్నది. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పరీక్షల టైంటేబుల్‌ను మంత్రి విడుదల చేశారు. ఒక్కో పరీక్ష మధ్య రెండురోజులు సమయం ఉంటుందని, ఆదివారం కూడా పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మార్చిలో జరుగుతున్న టెన్త్‌ పరీక్షలను కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో అర్ధంతరంగా వాయిదా వేశామని.. మిగిలిపోయిన సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాలంటూ తాజాగా సూచించడంతో షెడ్యూల్‌ జారీచేశామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా బెంచ్‌కి ఒక్కరినే కూర్చోబెట్టే ఏర్పాట్లుచేశామని, ఇందుకోసం ఇప్పటికి ఉన్న 2,530 పరీక్ష కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 26,422 మంది అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.


గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రానికి అరకిలోమీటర్‌ దూరంలోపే కొత్త కేంద్రం ఉంటుందని.. కేంద్రం మార్పు విషయాన్ని ప్రధానోపాధ్యాయులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. పరీక్ష కేంద్రాన్ని మొత్తం శానిటైజ్‌ చేస్తామని, విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడంతోపాటు, మాస్కులు అందజేస్తామని.. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని, పరీక్షలపై సలహాలు, సూచనల కోసం ప్రత్యేక సహాయకేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. పరీక్షల విధుల్లో ఉండే ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు చేతులకు గ్లౌజ్‌లు వేసుకుంటారని పేర్కొన్నారు. కరోనాపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. 


ఆదివారాలు కూడా పరీక్షలు


ఒక్కో పరీక్షలకు రెండు రోజుల విరామం ఇస్తూ టైంటేబుల్‌ తయారుచేసిన విద్యాశాఖ ఆదివారం కూడా పరీక్షలు నిర్వహించనున్నది. ఇంగ్లిష్‌, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం ప్రధాన పరీక్షలు జూన్‌ 29తో ముగియనుండగా.. ఆ తర్వాత ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌-1, పేపర్‌-2తో పాటు ఒకేషనల్‌ థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరుగనుండగా.. ఓఎస్‌ఎస్‌సీ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఒకేషనల్‌ కోర్సు పరీక్ష 11.30 గంటల వరకు నిర్వహిస్తారు.