నేటి  నుంచి పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌


 


పట్టణం, పల్లెల్లోనూ కార్యక్రమాలు


ఆదిలాబాద్‌ : రాబోయేది వర్షాకాలం.. అపరిశుభ్రత కారణంగా దోమలు వృద్ధి చెంది అనేక రోగాలకు కారణమవుతుంటాయి. సీజినల్‌ వ్యాధులకు గురిచేస్తుంటాయి. దీనికంతటికీ అపరిశుభ్రతే కారణం.. దీనిపై దండయాత్ర చేసేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎనిమిది రోజులు ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనుంది. పట్టణాల్లో వార్డుకు ఒక ప్రత్యేకాధికారి ఉండగా.. వారిలో సగం మందిని కార్యక్రమం నుంచి తప్పిస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన ఏఈలను మినహాయించి.. మిగతా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఒక్కో రోజు ఆరు వార్డుల చొప్పున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.


పారిశుద్ధ్యానికే ప్రాధాన్యం


వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టనున్న ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేందుకు పెద్ద మురుగుకాల్వల్లో పూడిక తొలగించడం, చిన్న మురుగుకాల్వల్లో నిండుకున్న చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేయనున్నారు. వీటిలో ఫాగింగ్‌ యంత్రాల ద్వారా దోమల మందు పిచికారీ చేయడం, భవన నిర్మాణ వ్యర్థాలు, ఖాళీ ప్రాంతాల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగించడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఖాళీ ప్రాంతాలను శుభ్రం చేయడంతో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆయా వార్డుల్లో నీటి సరఫరాలో ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని పరిష్కరిస్తారు. ప్రస్తుతం పురపాలకంలో 329 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పట్టణంలోని 49 వార్డుల్లో ఒకేసారి పనులు చేపడితే.. కార్మికుల కొరతతో ఆయా పనులను పూర్తిచేయడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత కార్మికులందరినీ విభజించి ఆరు వార్డుల్లోనే మోహరించనున్నారు.


అలసత్వం వహిస్తే చర్యలు


గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచి, కార్యదర్శి, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులు తొలిరోజు గ్రామంలో పాదయాత్ర చేపడతారు. రానున్న ఏడు రోజుల పాటు చర్యలు తీసుకుంటారు. హరితహారంలో భాగంగా దోమల నివారించేందుకు కృష్ణ తులసి, పుదీనా, సిట్రోనెల్లా, లెమన్‌గ్రాస్‌ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వారంలో రెండు రోజుల పాటు గ్రామంలో జనసమ్మర్ధ ప్రాంతాలను శుభ్రపరుస్తారు. ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాన్ని గ్రామంలో సక్రమంగా అమలు చేయకుండా అలసత్వం వహిస్తే సంబంధిత గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.