నగరంలో మరో 45 బస్తీ దవాఖానలు

హైదరాబాద్:  మన బస్తీలో.. ఇంటి పక్కనే వైద్యం.. అదీ ఉచితంగా.. ఇప్పటికే నగరంలోఅందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు మరింత విస్తృతం అవుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 45 వైద్యశాలలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారు. వీటి కోసం భవన నిర్మాణాలు పూర్తి చేసి సిబ్బందిని నియమించారు. కాగా గ్రేటర్‌లో ఇప్పటికే 123 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు  అందిస్తున్నారు. గ్రేటర్‌లో సర్కారీ వైద్యం మరింత చేరువ కానున్నది. అట్టడుగు, పేద వర్గాలకు  వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఇప్పటికే 123 దవాఖానలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా మరో 45 బస్తీ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే భవన నిర్మాణ పనులను పూర్తి చేసిన అధికారులు వైద్య పరికరాలనూ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సిబ్బంది నియామక ప్రక్రియను సైతం పూర్తి చేసి ఆరోగ్య సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. 


గ్రేటర్‌ పరిధిలో 123 దవాఖానలు.. 


గ్రేటర్‌ పరిధిలో 123 బస్తీ దవాఖానలుండగా ఇందులో  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 74, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్‌లో 26 ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా రోజువారీ పనులు చేసుకునే ప్రజలు చిన్నపాటి జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, లేదా మెడికల్‌ షాపుకెళ్లి నాలుగు మందుబిల్లలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. తీరా రోగం ముదిరాక పెద్ద దవాఖానలకు పరుగులు తీస్తుండడంతో  కోరంటి, ఉస్మానియా, గాంధీ దవాఖానలపై భారం పెరిగేది. అయితే బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే రోగులు వాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో వానకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌, డయేరియా, కలరా, చికున్‌గున్యాకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. అంతేకాక పెద్ద దవాఖానలకు వెళ్లి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతున్నది. బోధనా వైద్యశాలలైన ఉస్మానియా, గాంధీలపై భారం తగ్గుతున్నది. అంతకంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ రోగాలను నియంత్రించడం సాధ్యమవుతున్నది.


ఆపత్కాలంలో ఆదుకున్న బస్తీ దవాఖానలు.. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ప్రైవేట్‌ దవాఖానలు పూర్తిగా మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర, ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో రోగులు ఉస్మానియా, నిలోఫర్‌ లాంటి వైద్యశాలలకు వెళ్లలేకపోయారు. ఈ ఆపత్కాల సమయంలో బస్తీ దవాఖానాలే ఆదుకున్నాయి. 


55 రకాల వైద్య పరీక్షలు


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే డయాగ్నోస్టిక్‌ సెంటర్లన్నీ మూసి ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బస్తీ దవాఖానలు అన్నీ తామై సేవలందిస్తున్నాయి. ఇక్కడ రోగులకు బీపీ, షుగర్‌, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ 125 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.