దేశంలో నోవెల్ కరోనా వైరస్ కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 6088 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.18 లక్షలకు చేరుకున్నది. ఇప్పటి వరకు మన దేశంలో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 3583గా ఉన్నది. గత 24 గంటల్లో 148 మంది కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఉన్న 80 శాతం బెడ్‌లను ఆగస్టు 31 వరకు బుక్ చేసుకున్నది. ఎపిడమిక్ డిసీజ్ చట్టం కింద మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ చట్టంతో ప్రైవేటు ఆస్పత్రి బెడ్‌లను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. చికిత్స బిల్లులపై ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసింది.