24 గంటల్లోనే 5.7 లక్షల టికెట్లను అమ్మేసిన రైల్వే!

న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి 200 రైళ్లను నడిపేందుకు సిద్ధమైన ఇండియన్ రైల్వే నిన్నటి (గురువారం) నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. టికెట్ల విక్రయం ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 5.72 లక్షల టికెట్లను బుక్ చేసినట్టు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొత్తం 12,54,706 మంది ప్రయాణికులకు గాను 24 గంటల్లో 5,72,219 టికెట్లను విక్రయించినట్టు ఆయన వివరించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా గురువారం నుంచి రైల్వే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత రైల్వే ఒక ప్రకటన చేస్తూ పీఆర్ఎస్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారానూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే తెలిపింది.