నాగర్‌కర్నూల్,(ఆరోగ్యజ్యోతి): కరోనా చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలోని బీసీకాలనీలో 58రోజుల చిన్నారి కరోనాతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని అన్ని శాఖల అధికారులు పరిశీలించారు. ఈ కాలనీలోకి కొత్తవారు ప్రవేశించకుండా పోలీసులు దిగ్బంధం చేశారు. వివరాలిలా ఉన్నాయి..గత నెల 3న నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు జన్మించాడు. పది రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తల్లి తిరిగి బాబుతో పాటు ఉప్పునుంతలలోని పుట్టింటికి వచ్చింది. కాగా ఈనెల 27న బాబు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాబుకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయగా అక్కడికి చేర్చేలోపే బాబు మృతి చెందాడు. తల్లిదండ్రుల రక్త నమూనాలు తీసుకోగా..ఫలితాలు ఆదివారం వచ్చే అవకాశం ఉందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 28 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.