తెలంగాణలో కరోనాను జయించిన పసికందు-వైరస్‌ సోకి కోలుకున్నవారిలో దేశంలోనే అతిపిన్న వయస్కుడు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): గాంధీ వైద్యుల కృషి.. ఓ తల్లికి తన బిడ్డను మళ్లీ అక్కున చేర్చింది. 20 రోజుల క్రితం వైరస్‌ సోకిన తన బిడ్డను తీసుకొని ఎంతో ఆందోళనతో దవాఖానలో అడుగుపెట్టిన ఆ తల్లి బుధవారం ‘డాక్టరోంకో ఔర్‌ తెలంగాణ సర్కార్‌కో షుక్రియా ఆదా కర్తీహూ’ అంటూ ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లారు. పుట్టిన 23 రోజులకే కరోనా సోకగా, ఆ మహమ్మారితో 21 రోజులపాటు పోరాడి విజయం సాధించాడు ఆ చంటోడు. వైరస్‌ సోకి కోలుకున్నవారిలో దేశంలోనే అతిపిన్న వయస్కుడిగా వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతడికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అతని 23 రోజుల కుమారుడికి విరేచనాలు కావడంతో నిలోఫర్‌కు తీసుకెళ్లారు. శి శువులో వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ తండ్రికి పాజిటివ్‌ ఉండటంతో తల్లీబిడ్డకు నిర్ధారణ పరీక్షలుచేశారు. తల్లికి నెగెటివ్‌రాగా, పసివాడికి పాజిటివ్‌గా తేలటంతో ఈ నెల 10న గాంధీకి తరలించారు. 19 రోజులపాటు  వైద్యులు మెరుగైన చికిత్స అందించగా కోలుకోవడంతో డిశ్చార్జిచేశారు. ఈ శిశువుతోపాటు 12 ఏండ్లలోపు చిన్నారులు మరో 13 మంది ని డిశ్చార్జి చేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. గాంధీలో ఇప్పటివరకు సుమారు 95 మంది చిన్నారులు పాజిటివ్‌తో చేరగా, కోలుకొన్నవారిని  డిశ్చార్జి చేస్తున్నారు.