ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న తమకు రక్షణ అవసరం లేదా..? అని జర్మనీలో వైద్యులు పశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రాణాలను లెక్కచేయడం లేదని, తగినన్ని పీపీఈ కిట్లను అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా డాక్టర్లంతా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వైద్యపరికరాలను అడ్డు పెట్టుకుని విధులు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు పీపీఈ కిట్లను సమకూర్చాలని డిమాండ్ చేశారు.అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరుగడంతో కొరత ఏర్పడిందని, వైద్యులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని జర్మనీ ప్రభుత్వం కోరుతున్నది. ఇతర దేశాల నుంచి మరిన్ని పీపీఈ కిట్లను తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా కొత్త కిట్లను తెప్పిస్తామని వైద్యులకు హామీ ఇస్తున్నది.