తెలంగాణలో కరోనా కేసులపై స్పష్టత ఇచ్చిన మంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణలో 1,009కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో ఈ రోజు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఈ ఆరు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనన్నారు. మంగళవారం 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ఇప్పటివరకు 374మంది డిశ్చార్జ్‌ అయినట్లు ఈటల స్పష్టం చేశారు. 610 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 25మంది మృతి చెందారని చెప్పారు. ఈ నెల 21 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. పాజిటివ్‌ కేసుల్లో 50శాతం జీహెచ్‌ఎంసీలో వచ్చినవేనని చెప్పారు. ‘‘ తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. తెలంగాణలో చేపడుతున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి. కరోనా టెస్టులు ఎక్కువగా చేయడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టెస్టుల వివరాలన్నీ చాలా డైనమిక్‌గా ఉంటాయి.’’ అని మంత్రి ఈటల తెలిపారు.