న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నది. మొదట మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని.. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరుగడంతో లాక్‌డౌన్ గడువును మే 3 వరకు పొడిగించారు. మరో మూడు రోజుల్లో ఆ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలు దాటింది. మరణాలు వెయ్యి మార్కును దాటేశాయి. ఇంకా రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వద్దా? ఒకవేళ పొడిగిస్తే ఎప్పటివరకు పొడిగించాలి? లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయి? పొడిగించకపోతే ఎదురయ్యే సమస్యలు ఏవి? ఇవీ.. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధాని నరేంద్రమోదీ ముందు ఉన్న ప్రశ్నలు. ఇటీవల ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పలువురు సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూచించారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా 300 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నది. వాటిలో హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్ జిల్లాల్లో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో హాట్‌స్పాట్ల ఆధారంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే, ఇదే సమయంలో ప్రజారవాణాకు అవకాశం లేకుండా ఎక్కడివాళ్లు అక్కడే ఉండి స్థానికంగా పనులు చేసుకునేలా చూడాలని కూడా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక గత ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని పైసా, ప్రజల ప్రాణం రెండూ ముఖ్యమేనని చెప్పడంతో.. ప్రజల్లో కరోనా విస్తరించకుండా చర్యలు చేపడుతూనే లాక్‌డౌన్ ఎత్తివేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దఫా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.