కరోనా వైరస్ వ్యాప్తినివారణకు మాస్క్‌లు, సామాజిక దూరం ముఖ్యం
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : కరోనా వైరస్‌వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని ఉస్మానియా ఆసుపత్రి వైద్యనిపుణులు డాక్టర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి వైద్యనిపుణులు డాక్టర్ శ్రవణ్‌కుమార్, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీధర్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వైరస్ శ్వాసలోకి పీల్చినప్పుడు లేదా వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొని అదేచేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. తీ వ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా వైరస్ సోకినట్టు గుర్తించ వచ్చని తెలిపారు. కొంత మంది చిన్నపాటి జ్వరం వస్తేనే భయపడి పోతున్నారని, అటువంటి వ్యక్తులు భయపడాల్సిన పనిలేదన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను ఖచ్చితంగా కలవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కంటైన్‌మెంట్‌జోన్లో ఉండే వారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆసుపత్రులలో డాక్టర్లకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. లాక్‌డౌన్ అనంతరం కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి అన్నారు.