న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి) : కరోనా మహమ్మారి విషయంలో తాము ముందే హెచ్చరించామని, అప్పుడే విని జాగ్రత్తపడితే ఇంత అనర్థం జరిగేది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్నది. పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020, జనవరి 30 నాడే అంతర్జాతీయంగా కొవిడ్-19 అత్యవసర పరిస్థితి ప్రకటించిందని టెడ్రోస్ గుర్తుచేశారు. అప్పటికీ చైనాయేతర దేశాల్లో 82 కేసులు మాత్రమే ఉన్నాయని, ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అప్పుడు తమ హెచ్చరికలు విని జాగ్రత్తపడిన దేశాలు మిగతా దేశాలకంటే మెరుగ్గా ఉన్నాయని టెడ్రోస్ గెబ్రెయేషన్ తెలిపారు.