వాషింగ్టన్: సూర్యకాంతికి కరోనాను చంపే సామర్థ్యం ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత (అల్ట్రావయలెట్-యూవీ) కిరణాలు వైరస్‌ను కేవలం 2 నిమిషాల్లోనే నాశనం చేస్తాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ (డీహెచ్‌ఎస్) శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మేరకు పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి ఆధారాలు వెల్లడిస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కరోనా రోగుల శరీరంలోకి యూవీ కాంతిని పంపాలంటూ వ్యాఖ్యానించి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీహెచ్‌ఎస్ శాస్త్రవేత్త విలియం బ్రయాన్ మంగళవారం మాట్లాడుతూ.. కరోనా వైరస్ మీద సూర్యరశ్మిలోని యూవీ కిరణాల ప్రభావంపై తాము అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఉష్ణోగ్రత 21-24 డిగ్రీ సెంటీగ్రేడ్, తేమ 80 శాతం ఉన్నప్పుడు స్టీల్ వంటి చదునైన తలంపై ఉండే వైరస్‌ల సంఖ్య రెండు నిమిషాల్లోనే సగానికి పడిపోయిందని చెప్పారు. అదే ఉష్ణోగ్రతల వద్ద తేమ 20 శాతం ఉన్నప్పుడు గాలిలోని వైరస్‌ల సంఖ్య ఒకటిన్నర నిమిషంలోనే సగానికి తగ్గిందన్నారు. అయితే ఈ పరిశోధనపై కొన్ని అనుమానాలు తలెత్తాయి. సాధారణ సూర్యరశ్మిలో ‘యూవీ-ఏ, యూవీ-బీ’ రకం కిరణాలు ఉంటాయి. ఎండలో తిరిగితే చర్మం నల్లగా మారడానికి యూవీ-ఏనే కారణం. అయితే.. వీటివల్ల వైరస్ వంటి సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం ఉండదని అధ్యయనాలు చెప్తున్నాయి. యూవీ-సీ అనే రకం కిరణాలు మాత్రమే వైరస్‌లు లేదా జంతువుల కణాలపై ప్రభావం చూపిస్తాయి. అయితే.. భూ ఉపరితలానకి చేరే సూర్యరశ్మిలో యూవీ-సీ కిరణాలు ఉండవు. వీటిని మన వాతావరణం అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలో సూర్యకాంతి వల్ల కరోనా వైరస్ ఎలా మరణిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
త్వరలో అధ్యయన పత్రం
ఈ సందేహాలపై డీహెచ్‌ఎస్ శాస్త్రవేత్త లాయిడ్ హగ్ స్పందిస్తూ.. సూర్యరశ్మితో సమానమైన పౌనఃపుణ్యం కలిగిన కాంతినే తమ పరిశోధనల్లో వినియోగించామన్నారు. ‘జూన్ 21న సముద్రమట్టం స్థాయిలో 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండే ఉష్ణోగ్రతకు సమానమైన కాంతితో పరిశోధనలు నిర్వహించాం. ఇది 280-400 నానోమీటర్ల పౌనఃపున్యంతోఉంటుంది’ అని పేర్కొన్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌పై కరోనాతో కూడిన తుంపర్లను ఉంచి పరీక్షించామన్నారు. త్వరలోనే అధ్యయన పత్రాన్ని సమర్పిస్తామన్నారు.
ఎండ, వైరస్ మధ్య 85శాతం సహసంబంధం
వైరస్‌ను కట్టడిచేసే శక్తి సూర్యరశ్మికి ఉన్నదని మన దేశానికి చెందిన ‘నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (నీరి) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగడం, కరోనా కేసులు తగ్గడం మధ్య 85 శాతం సహసంబంధం ఉన్నట్టు తెలిపారు. వారు మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్యపై అధ్యయనం చేశారు. రెండు రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు, తేమ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు నమోదైన కేసుల సంఖ్యను అధ్యయనం చేశారు. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు కొత్త కేసుల నమోదు తగ్గిందని గుర్తించారు.