వాషింగ్టన్ : క్షయ వ్యాధి నివారణకు ఇచ్చే బిసిజి (కాల్మెట్-గురిన్ ) వ్యాక్సిన్ ద్వారా కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. భారత్, చైనా, పోర్చుగల్ వంటి దేశాలు టీబీ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా అమలుచేస్తున్నందునే ఈ దేశాల్లో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉందని అమెరికాలో న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు, కరోనా కేసులు మృతులు సంఖ్య తక్కువగా ఉండడానికి సంబంధం ఉందని వైద్య పరిశోధనలకు సంబంధించిన మెడ్‌ఆరెక్సివ్ వెబ్‌సైట్ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ అధ్యయనాన్ని ప్రచురించింది.
కరోనా లింక్ అదేనా
క్షయ, కరోనా రెండూ తుంపర్ల ద్వారా ఇతరులకు సంక్రమిస్తాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్‌కి, కరోనాకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే టీబీ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన దేశాల్లో కరోనా మరణాల రేటు 2.65 శాతంగా ఉంటే, అమరికా, ఇటలీ, నెదర్లాండ్ వంటి దేశాల్లో మరణాల రేటు 9.19 శాతం ఉందని యూఎస్ పరిశోధకుల బృందం వెల్లడించింది. అయితే కరోనా వైరస్‌కు, బిసిజి టీకాకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు. దీనిపై క్రినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
వ్యాక్సిన్ వల్లే రోగ నిరోధక శక్తి
అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోనే కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. దీనికి కారణం ఆయా దేశాలన్నింటిలోనూ టీబీ కేసులు అత్యంత స్వల్పం. టీబీని నిరోధించే బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనలు కూడా లేవు అని ప్రాథమికంగా అంచనా వేశారు. కెనడాలో టొరాంటో యూనివర్సిటీ ఇమ్యూనాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఎలీనార్ ఫిష్ దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చెయ్యాలన్నారు. టీబీ వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈక్వెడార్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో 1980 కాలం నుంచే టీకాను తప్పనిసరి చేసినందున, బెల్జియం, నెదర్లాండ్ దేశాలతో పోలీస్తే ఈ దేశాల్లో తక్కువ కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు.