హృద్రోగ, రక్తపోటు మందులు దొరక్క ఇబ్బందులు


 




ప్రాణావసర మందులకు గండం


లాక్‌డౌన్‌తో సరఫరా వ్యవస్థకు ఆటంకం


మధుమేహుల్ని వేధిస్తున్న ఇన్సులిన్‌ కొరత


హృద్రోగ, రక్తపోటు మందులు దొరక్క ఇబ్బందులు


మెడికల్‌ షాపుల్లో లభించని అత్యవసర ఔషధాలు


స్టాకు రావడం లేదని చెబుతున్న యజమానులు


సేల్స్‌మెన్‌ను తగ్గించేసిన డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు


 


హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): శేరిలింగంపల్లికి చెందిన మూర్తి షుగర్‌ రోగి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆయన ‘రైజోడెగ్‌’ ఇన్సులిన్‌ను తీసుకోవాల్సిందే. కానీ... రెండు, మూడు రోజులుగా దగ్గరలోని మందుల షాపులో రైజోడెగ్‌ దొరకడం లేదు. అదేమంటే... స్టాక్‌ రావడం లేదని మెడికల్‌ షాపుల యజమానులు చెబుతున్నారు. దీంతో మూర్తి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. షుగర్‌ లెవల్స్‌ పెరుగుతుండడంతో గత్యంతరం లేక వేరే బ్రాండ్‌ ఇన్సులిన్‌ వాడుతున్నారు. ఇది ఒక్క మూర్తి సమస్యే కాదు. రాష్ట్రంలో చాలా మందికి అత్యవసర, ప్రాణావసర మందులు(లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌) సమయానికి దొరకడం లేదు. ఇదంతా కరోనా సృష్టించిన పరిస్థితి. లాక్‌డౌన్‌ కారణంగా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన ఆటంకాలతో మెడికల్‌ షాపుల్లో ప్రాణావసర మందులు అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఓపీలు లేకపోవడం, చిన్న ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు మూతపడడంతో ఔషధ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు సైతం సేల్స్‌మెన్‌ను తగ్గించేశాయి. ఉన్న వారు కూడా మెడికల్‌ షాపులకు సక్రమంగా ఔషధాలు సరఫరా చేయలేని పరిస్థితులున్నాయి.కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకోవడం, మరి కొన్ని చోట్ల వాహనాలు, కొరియర్‌ సంస్థలు అందుబాటులో లేకపోవడంతో మందుల సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి.ఫలితంగా రోగులకు సరైన సమయానికి అత్యవసర మందులు దొరకడం లేదు.


 


ఏ మందుల షాపుకెళ్లినా... ఫలానా ఔషధం లేదని, కొన్నిసార్లు ఇతర బ్రాండ్ల మందులున్నాయన్న సమాధానాలొస్తున్నాయి. దీంతో ముఖ్యంగా షుగర్‌, బీపీ, హృద్రోగ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు వేసుకునే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా... హృద్రోగ బాధితులు, బీపీ రోగుల రక్త ప్రసరణలో ఇబ్బందులొస్తాయి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే.. హృద్రోగులు ఎక్కువగా వినియోగించే ‘డిల్‌జెమ్‌’, బీపీ పేషెంట్లు వాడే ‘టెల్మిసార్టన్‌’ మాత్రలు దొరకడం లేదు. అంతే కాదు.. పలు బ్రాండ్ల మందులు, ఇంజెక్షన్లు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఇక, షుగర్‌ రోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.సాధారణంగా మధుమేహ రోగులు  రైజోడెగ్‌, హ్యూమన్‌ మిక్స్‌టార్డ్‌, నోవో మిక్స్‌ వంటి ఇన్సులిన్లు వినియోగిస్తారు. రాష్ట్రంలో ఎక్కువగా వినియోగమయ్యే రైజోడెగ్‌ దొరక్కపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. హ్యూమన్‌ మిక్స్‌టార్డ్‌ పరిస్థితీ అలాగే ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కుందామన్న మందులు దొరకని పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. 


 


ఎందుకీ సమస్య?


సాధారణంగా ఔషధాల సరఫరా ఒక చైన్‌ విధానంలో కొనసాగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌, ముంబై, కోల్‌కతా, బెంగళూరుల్లో ఉన్న ఉత్పత్తి సంస్థల నుంచి వివిధ రకాల మందులు, సిర్‌పలు, ఇంజెక్షన్‌ వాయిల్స్‌, ఇన్‌హేలర్స్‌, ఆయింట్‌మెంట్లు... క్యారీ అండ్‌ ఫార్వర్డ్‌(సీ అండ్‌ ఎఫ్‌) ఏజెన్సీలకు వస్తాయి. సదరు ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా తమ ఆధీనంలోని ఆథరైజ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలకు పంపిస్తాయి. ఇక్కడి నుంచి మెడికల్‌ షాపులకు మందులు సరఫరా అవుతాయి. అయితే, కరోనా కారణంగా ఈ సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో 25వేల వరకు మెడికల్‌ షాపులు ఉండగా, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 5,000పైగా ఉన్నాయి.


 


వీటన్నింటికీ సేల్స్‌మెన్‌ ద్వారా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ఔషధాలు సరఫరా చేసేవి. కానీ... ఇప్పుడు చాలా కంపెనీలు సిబ్బందిని తగ్గించేశాయి. దీనికితోడు మందులు సరఫరా చేసే వాహనాలు అందుబాటులో ఉండకపోవడం, కొరియర్‌ సర్వీసులన్నీ మూతపడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పర్యవసానంగా రోగులకు కూడా నాలుగైదు రోజుల ఆలస్యంగా మందులు అందుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ఔషధాల కొరత లేదని, చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జెడీ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. ఔషధ రవాణా వాహనాలకు ఆటంకాలు కలిగించొద్దని పోలీసులను కోరామని, ఎక్కడైనా వాహనాలను ఆపితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.


 


ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది.. చెరుకూరి జనార్దన్‌రావు, కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


లాక్‌డౌన్‌ మొదట్లో ఔషధాల సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మెడికల్‌ షాపులకు సకాలంలో మందులు అందలేదు. మా సంఘం తరఫున ప్రభుత్వాన్ని కలిసి, రవాణా ఆటంకాలు లేకుండా చూడాలని కోరాం. పోలీసులు, డీసీఏ అధికారులు ఇస్తున్న పాసులతో ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి గట్టెక్కుతున్నాం. ప్రస్తుతానికి మందుల కొరత పెద్దగా లేదు.. రవాణా సమస్య వల్ల సకాలంలో అందడం లేదు.