న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై భారత దేశం చాలా ముందుగా పోరాటం ప్రారంభించిందని పులిట్జర్ పురస్కార గ్రహీత పాత్రికేయుడు, ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ థామస్ ఫ్రీడ్‌మన్ ప్రశంసించారు. ఈ మహమ్మారిపై యుద్ధం కోసం భారత దేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న చర్యలను మెచ్చుకున్నారు.
ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘ఈ-కాంక్లేవ్ కరోనా వైరస్’ కార్యక్రమంలో మంగళవారం థామస్ ఫ్రీడ్‌మన్ మాట్లాడారు. ఈ మహమ్మారిపై పోరులో భారత దేశం కచ్చితంగా తొలి ప్రయోజనాలను పొందిందని, అయితే ముందు ముందు పెద్ద సవాలును ఎదుర్కొనవలసి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడం పెద్ద సవాలు అని వివరించారు. కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించేందుకు దీర్ఘకాలిక అష్ట దిగ్బంధనంతో ఆర్థికంగా స్థిరత్వం సాధించే సామర్థ్యం సవాలుతో కూడుకున్నదని చెప్పారు. ఇది భారత దేశం వంటి దేశానికి పెను సవాలు అని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ భారతావనిలో ఇది మరింత పెద్ద సవాలు అని తెలిపారు. గ్రామీణ భారతంలో 10 వేల మందికి ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. అటువంటి చోట్ల కనీసం వేరొక గది అయినా ఉండని ఇళ్ళలో ఒకరికొకరు దూరంగా ఉండాలని ప్రజలను కోరడం సమస్యాత్మకమని వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నట్లు తెలిపారు. జనాభాలో ఎక్కువ మందికి అంటువ్యాధుల నిరోధక శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును ప్రారంభంలో తెగ్గొట్టడంలో మోదీ కృతకృత్యులయ్యారన్నారు. ప్రజలు సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా చేయాలన్నారు.