మెదక్, (ఆరోగ్యజ్యోతి) : వలస కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ భవన నిర్మాణం కోసం వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 1600 మంది కూలీలు, లాక్‌డౌన్ కారణంగా గత నెలన్నర రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఉపాధిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తోడై ఆందోళనకు దిగారు. స్వస్థలాలకు బయల్దేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. పైగా పోలీసులు ఎంత చెప్పినా భౌతిక దూరం పాటించకుండా వందలమంది ఒకే చోట గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్..సమస్యలు పరిష్కరిస్తామని, జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వలస కూలీలు శాంతించారు.