వియత్నాంతో యుద్ధం కంటే అమెరికాలో ఎక్కువ ప్రాణనష్టం10,45,717 కరోనా పాజిటివ్ కేసులు
వాషింగ్టన్ : కరోనా విజృంభణకు అమెరికాలో 60వేల మందికిపైగా బలయ్యారు. వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన 58,220 మంది సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10,48,834కి చేరింది. ప్రపంచంలో నమోదైన 31,86,458 పాజిటివ్ కేసుల్లో మూడోవంతు అమెరికాలోనే ఉన్నా యి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణాలు 2,25,521. నాలుగో వంతు (60,495)కు పైగా ఇక్కడే నమోదయ్యాయి. వైరస్ అదుపులోకి వచ్చిన రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను తొలగిస్తున్నారు. కరోనాపై పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గడ్డుకాలం ముగిసిందని, లక్షలాది మంది దేశ ప్రజలు త్యాగాలు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో 127 దేశాల నుంచి 71,538 మంది అమెరికన్లను స్వదేశానికి రప్పించామని విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ తెలిపారు.