హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గురువారం పెరిగాయి. గురువారం కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ప్రభావంతో గురువారం ఒక్కరోజే తెలంగాణలో ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. తెలంగాణలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,038కి చేరింది.ప్రస్తుతం తెలంగాణలో 568 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం కరోనా నుంచి కోలుకున్న 33 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకూ 442 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారంలో కేసుల సంఖ్య మళ్లీ గురువారమే పెరగడం గమనార్హం. మృతుల సంఖ్య కూడా గురువారమే పెరిగింది.