ప్రైవేటు వైద్యానికి లాక్‌డౌన్‌!

మూతపడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నది. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  కొన్ని దవాఖానలు ఓపీ, మరికొన్ని  అత్యవసర సేవలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీనికి తోడు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న చాలామంది వైద్యులకు ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ వైద్యులందరూ కొవిడ్‌ కేసులతో బిజీగా ఉండడం సైతం ప్రైవేటు దవాఖానలు మూసివేయడానికి ఒక కారణమన్న అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.


(ఆరోగ్యజ్యోతి- తెలంగాణా ప్రతినిది ) : లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో అంటు వ్యాధులు, ప్రమాదాలు, అలర్జీ వంటి తదితర సమస్యలతో బాధపడేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌తో పెళ్ల్లిళ్లు, పండుగలు, యాత్రలు, విందులు, వినోదా లు, చిట్టి పార్టీలు, రాజకీయ విందులు లేవు. దీంతో ఎసిడిటీ, ఫుడ్‌ పాయిజన్‌, ఇతర జీర్ణకోశ వ్యాధులు, దగ్గు, జలుబు వంటి సమస్యలు బాధించడంలేదు. దూరప్రయాణాలు, పరిశ్రమల కాలుష్యంతో అలర్జీలు, అస్తమాలు, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధు లు లేవు. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, మరణాలు లేవు. మద్యంతో కలిగే అనారోగ్య సమస్యలు లేవు. వ్యాపారాలు, లావాదేవీలు, ఉద్యోగ, వృత్తిపరమైన ఒత్తిళ్లతో వచ్చే మానసిక ఇబ్బందులూ తగ్గాయి. ఎండలో తిరగకపోవడంతో వడదెబ్బ , చర్మ సంబంధ వ్యాధులు అసలే లేవు. దీంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గి, ప్రైవేటు దవాఖానలు మూసివేయడానికి కారణమైంది.


అత్యవసర సేవలు..


లాక్‌డౌన్‌ కారణంగా అసలు కేసులే రావడం లేదు. డెలివరీలు, పుట్టిన పిల్లలకు ఉన్న సమస్యలకు మాత్రమే ప్రైవేటు దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. రెగ్యులర్‌ చెకప్‌ చేసుకునే వైద్యశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో డెలివరీల కోసం ప్రభుత్వ దవాఖానలకు వరుస కడుతున్నారు. సాధారణ సమయంలో లెక్కకు మించి ఓపీలు చూసే వైద్యులు నేడు పరిమిత సంఖ్యలో పరీక్షిస్తున్నారు. అత్యవసరం కింద కేవలం ప్రసూతి కేంద్రాలే తెరిచారు. చిన్న చిన్న జబ్బులకు ఎవరూ దవాఖానలకు వెళ్లడం లేదు. ఇంటి చిట్కాలు పాటిస్తున్నారు. ఫోన్లలో వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప డాక్టర్‌ వద్దకు వెళ్లడం లేదు. 


అమ్మఒడి అండగా...


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రసవాలకు ఇక్కట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 102 అమ్మఒడికి ఫోన్‌ చేసి సేవలు పొందుతున్నారు. ఆదిలాబాద్‌లో అత్యవసర వైద్య సేవలు పొందడానికి సురక్ష వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.


తప్పని ఇబ్బందులు


ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, వ్యాధులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం అష్టకష్టాలు పడి ప్రైవేటు దవాఖాన మెట్లు ఎక్కుతుంటే నాడి పట్టే వైద్యుడు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 


లాక్‌డౌన్‌ తర్వాత యథావిధిగా..


 సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మకూడదు. ఏ దవాఖాన కూడా ఎత్తివేయం. అన్ని మల్టీ స్పెషలిటీ దవాఖానల్లో ఓపీ, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.