(ఆరోగ్యజ్యోతి- నెట్వర్క్ ): కోవిడ్19 నేపథ్యంలో ఇమ్యునైజేషన్ సర్వీసులకు బ్రేక్ పడింది. దీంతో ప్రస్తుతం తట్టు, పోలియో, కలరా, మెనింజిటిస్, డిప్తీరియా టీకాలు ఇచ్చే ప్రక్రియ కొన్ని చోట్ల నిలిచిపోయింది. దీని వల్ల భవిష్యత్తులో మళ్లీ తట్టు, పోలియో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు యూనిసెఫ్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నది. అయితే తట్టు, పోలియో కేసులు మాత్రం ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్19 బారిన పడకుండా ఉండేందుకు.. ఇమ్యూనైజేషన్ ఆపాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. దీంతో ఈ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ను నిలిపివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది చిన్నారులు తట్టు వ్యాక్సిన్ మిస్‌కానున్నారు. ఇప్పటికే గత ఏడాది సుమారు కోటి మందికిపైగా చిన్నారులు ఆ టీకా వేయించుకోలేదని యూనిసెఫ్ వార్నింగ్ ఇచ్చింది. 2019లో సుమారు 8 లక్షల తట్టు కేసులు నమోదు అయ్యాయి. ఒకవేళ ఈ ఏడాది వ్యాక్సినేషన్ తగ్గితే.. ఆ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్, కాంగో, సొమాలియా, సుడాన్ లాంటి దేశాలు తట్టు, పోలియా కేసులతో సతమతం అవుతున్నాయి. ఇప్పుడు కోవిడ్19 కేసులు కూడా ఆ దేశాల్ని మరింత ఛిన్నాభిన్నం చేయనున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ జరగడం లేదు. యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం 24 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రచారం జరగడం లేదు. ఆరోగ్య అధికారులంతా కోవిడ్‌పైనే దృష్టిపెట్టడంతో .. రెగ్యులర్ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. ఒకవేళ తట్టు, పోలియో టీకాలు ఇవ్వకుంటే.. ఈ ఏడాదిలో ఈ కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని, తర్వాత కూడా దీని ప్రభావాలు కనిపిస్తాయని యూనిసెఫ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో అవాంతరాలు, ఆలస్యం, వాయిదాల వల్ల లక్షలాది చిన్నారుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారనున్నది.