17 కిలోమీటర్లు నడిచిన కరోనా వృద్ధుడు

పుణే, (ఆరోగ్యజ్యోతి) : వృద్ధునికి కరోనా సోకింది. కానీ అతడు ఓ క్వారంటైన్ సెంటర్ నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఇదేమీ కరోనా పాజిటివ్ మారథాన్ కథ కాదు. పుణేలో జరిగిన ఘటన. బాలేవాడీ ప్రాంతంలోని కరోనా కేంద్రంలో అతడిని చేర్పించారు. కానీ అక్కడ రోగులకు తిండిపెట్టడం లేదని, స్నానాల గదుల వంటి మౌలిక వసతులు లేవని పారిపోయాడు. 17 కిలోమీటర్లు నడిచి యెరవాడలోని తన ఇంటికి చేరుకున్నాడు కానీ లోపలకు వెళ్లలేక బయటే చతికిలబడ్డాడు. కారణం ఏమంటే ఇంటికి తాళం ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా కరోనా క్వారంటైన్‌లో ఉన్నారు. నిస్సహాయంగా ఇంటిముందు కూర్చున్న వృద్ధుడిని ఇరుగుపొరుగు పసిగట్టారు. వృద్ధునికి కరోనా ఉందన్న సంగతి తెలుసుకున్న స్థానికులు అధికారులకు కబురు పెట్టారు. వృద్ధుని కొడుకు (అతనికి కూడా పాజిటివ్ ఉంది) వచ్చి తండ్రిని ఒప్పించి తీసుకువెళ్లాడు. మొత్తంమీద వృద్దుడిని అంబులెన్స్‌లో తిరిగి ఐసోలేషన్ సెంటర్‌కు పంపించి అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. క్వారంటైన్ సెంటర్‌లో తగిన వసతులు కల్పించాలని స్థానిక కార్పోరేటర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.