హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) :కరోనా నుంచి రాష్ట్రం మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ... డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 25 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. అయితే బుధవారం 14 మంది చిన్నారులు కరోనాతో పోరాడి విజయం సాధించారు. గాంధీ ఆస్పత్రి నుంచి 14 మంది చిన్నారులను అధికారులు డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి 14 మంది చిన్నారులు కోలుకున్నారు. కోలుకున్నవారిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నెల రోజుల చిన్నారి కూడా ఉంది. ఈ పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయని మంగళవారం రాత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,009కి చేరిందని, మంగళవారం 42 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించింది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన 25 మంది వివరాలను, వారి మరణానికి కారణాలను తొలిసారిగా ప్రభుత్వం వెల్లడించింది.