ఆగస్టు 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్సిటీల్లో కొత్త విద్యాసంవత్సరం ఆగస్టు 1న ప్రారంభం అవుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) బుధవారం వెల్లడించింది. పూర్వ విద్యార్థులకు తరగతులు ఆగస్టు 1న, కొత్త విద్యార్థులకు తరగతులు సెప్టెంబర్‌ 1న ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈమేరకు దేశంలోని అన్ని వర్సిటీలకు సమాచారమిచ్చింది. చివరి సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. వారంలో ఆరు రోజుల పని దినాల విధానాన్ని వర్సిటీలు అమలు చేయవచ్చని సూచించింది. ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు మరో 6 నెలల సమయాన్ని పొడిగిస్తున్నట్టు, వైవా-వాయిస్‌ పరీక్షలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ మార్గదర్శకాలు సూచనలు మాత్రమేనని, కొవిడ్‌-19 పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలు వీటిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చని సూచించింది. కాగా, పెండింగులో ఉన్న పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల్ని లాక్‌డౌన్‌ ముగిశాక మొదటి ప్రాధాన్యతగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.  పరీక్ష తేదీల వివరాల్ని విద్యార్థులకు కనీసం పది రోజుల ముందుగా తెలియజేస్తామన్నారు. జేఈఈ, నీట్‌ పరీక్షల్ని జూన్‌లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.