మీకు అనారోగ్యమా.. వైద్యసలహాలు ఉచితం డయల్‌ 040- 23489244



హైదరాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): లాక్‌డౌన్‌తో దూరప్రాంతాల నుంచి నిమ్స్‌కు రాలేకపోతున్న రోగులు టెలికన్సల్టెన్సీ ద్వారా ఉచితంగా వైద్య సలహాలు, సూచనలు పొందేలా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య సలహాల కోసం 040- 23489244 నంబర్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అపాయింట్‌మెంట్‌ తీసుకొంటే, ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య వైద్యులు ఫోన్‌చేసి సమస్యలు తెలుసుకొని మందులను సూచిస్తారు. నిమ్స్‌ యాప్‌, www. nims.edu.in <http://www.nims.edu.in>ను సైతం సంప్రదించవచ్చు. శుక్రవారం నుంచి టెలికన్సల్టెన్సీ సేవలను అమలుచేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. సేవలు పొందాలనుకొనేవారిని నాన్‌ ఎమర్జెన్సీ పేషెంట్‌ కేర్‌ కింద పరిగణిస్తారు. బాధితుల ఆరోగ్య సమస్యల ఆధారంగా ఫోన్‌ ద్వారా మందులను సూచిస్తారు. ఇప్పటికే చికిత్స పొందుతున్నవారు కూడా ఈ సేవలను వినియోగించుకొనే వెసులుబాటు కల్పించారు. పాత ప్రిస్క్రిప్షన్‌, రిపోర్టులను వాట్సాప్‌లో పంపిస్తే కొత్త మందులను సూచిస్తారు. టెలికన్సల్టెన్సీ ప్రక్రియలో జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమాటాలజీ వంటి విభాగాల్లో పూర్తిగా ఉచితంగా వైద్య సలహాలు అందించనున్నారు. దీర్ఘకాలిక సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారిని వైద్య పరీక్షల కోసం దవాఖానకు రావాల్సిందిగా సూచిస్తారు. ఈ ఏడు విభాగాల్లో అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ కోరారు.