- బియ్యంతో పాటు కందిపప్పు ఉచితం!
- వచ్చే నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ
- మున్సిపాలిటీల్లో అందుబాటులో గోధుమలు ..
- నామమాత్రపు ధరకు చక్కెర, ఉప్పు ప్యాకెట్ల విక్రయం
- లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సాయం
(ఆరోగ్యజ్యోతి- నెట్వర్క్) : లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతోమంది తాత్కాలికంగా ఉపాధి కోల్పోయారు. వారు ఆకలితో అలమటించకుండా ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్క్రార్డుదారు కుటుంబాల్లో ఇదివరకు ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇవ్వగా.. ఏప్రిల్ నెల కోటాలో కరోనా సాయంగా 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. మే నెలలోనూ బియ్యంతో పాటు అదనంగా కిలో కందిపప్పును ఉచితంగానే అందించనున్నది. గోధుమలు, చక్కెర, ఉప్పు ప్యాకెట్లను నిర్దేశిత ధరకు విక్రయించనున్నారు. ప్రతి కార్డుదారుకు రూ.1500 బ్యాంకు, తపాలా ఖాతాల్లో జమ కానున్నది.లాక్‌డౌన్ కారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం, సరుకులు పంపిణీ సమయంలో నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. కార్డుదారులకు టోకెన్ ఇవ్వాలని, దుకాణం వద్ద సరుకుల పంపిణీ సందర్భంగా సామాజికదూరం పాటించాలని సబ్బు, నీటిని అందుబాటులో ఉంచాలని సూచించింది. మాస్కులు ధరించిన కార్డుదారులకే సరుకులు ఇవ్వాలని, రేషన్ దుకాణాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించింది. దుకాణాల వద్దకు వచ్చే గర్భిణులు, వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.