- కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు
- లైసెన్సులు రద్దు.. పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపుతాం
- జీవితాలను, వ్యాపారాలను పాడుచేసుకోవద్దు
- తస్మాత్ జాగ్రత్త.. వ్యాపారులకు సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరిక
కూరగాయల ధరల్ని పెంచడం బాధాకరం. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. మనం వాడుకొనేవి 27 లక్షల టన్నులే. మూడు లక్షల టన్నుల మిగులు మన దగ్గర ఉంది. అయినప్పటికీ, ధరలు పెంచుతామంటే కుదురదు. అయ్యా బుచ్చి, అవ్వా బుచ్చి అంటే నడువదు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్ముతరో పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తా.
- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్,: కరోనా నేపథ్యంలో రాష్ట్రం లాక్‌డౌన్ పరిస్థితిని అదునుగా చేసుకొని ఎవరైనా కూ రగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘కూరగాయల ధరల్ని పెంచడం బాధాకరమైన విషయం. 30 లక్షల మెట్రిక్ టన్ను ల కూరగాయలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతాయి. మనం వాడుకొనేవి 27 లక్షల మెట్రిక్ టన్నులే. మూడు లక్షల టన్నుల కూరగాయల మిగులు మన దగ్గర ఉం టుంది.
అయినా, ధరలు పెంచుతామంటే కుదురదు. అయ్యా బుచ్చి, అవ్వా బుచ్చి అంటే నడువదు. రేపట్నుంచి ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే పీడీ యా క్టు పెట్టి జైలుకు పంపిస్తాం. అందులో ఎలాంటి అనుమానంలేదు. కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చినం. అధికంగా ధరలు పెంచి ఈ టైములోనే ప్రజల రక్తం పిండుకుంటామని ఎవరైనా అనుకున్నా.. కూరగాయలు ధర పెంచినా, నిత్యావసర సరుకుల ధరలు పెంచినా లైసెన్సులు క్యాన్సిల్‌చేస్తాం. దుకాణాలు సీజ్‌చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. మీ జీవితాలు పాడుచేసుకోవద్దు, వ్యాపారాల్ని దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రెయిటర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తది. మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతది. తర్వాత ఎంత రోదించినా లైసెన్సులు రావు. షాపులు కూడా రద్దుచేస్తాం. అన్నీ పోతాయ్. దేశమంతటా అల్లకల్లోలం, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే ఈ సమయమే దొరికిందా ధరలు పెంచడానికి? జేబులు కొల్లగొట్టేది ఇప్పుడేనా మీకు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? అది పద్ధతి కాదు. ఈ సమస్య ఎప్పటివరకూ కంటిన్యూ అవుతుందో ఎవరికీ తెలియదు. మన చేతుల్లో లేదు. అమెరికావంటి దేశమే ఇయ్యాల హయ్యెస్ట్ సఫరర్. అక్కడి కేసులు 45 వేలు దాటి నయి.
ఒక ఉత్పాతంలో భయంలో పడ్డరక్కడ. ఆర్మీని పిలిచారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలాం టి సమయంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది ఉంటుంది. మన దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని లెక్కిస్తే ముఫ్పైయ్‌వరకూ లాక్‌చేశారు. మన రాష్ట్రంలో బయటికి పోదామంటే అవకాశం లేదు. అడుగడుగునా చెక్‌పో స్టు. అయినా ఎందుకు పోవాలి? ఎటు పోతరు? అవసరం లేదు. వేరే దేశం, రాష్ట్రం, పుణ్యక్షేత్రం పోదామంటే అవసరంలేదు. దయచేసి ప్రజలందరికీ దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా. ఒక ఆపత్కాల సమయంలో మనమంతా కచ్చితంగా నియంత్రణ పాటించాలి. షాపులు ఎట్టి పరిస్థితుల్లో ఆరు గంటలకు క్లోజ్ చేయాలి. గుంపులు గుంపులుగా షాపుల మీద పడకూడదనే పొద్దున్నుంచి సాయంత్రం వరకూ పెట్టినం. లేని గాబరాను తెచ్చుకోవద్దు. ప్రజలు ఒకచోట గుమికూడదనేది మన ప్రిన్సిపుల్. ప్రతివ్యక్తి మధ్య మూడు అడుగుల డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలి. పదే పదే నేను విజ్ఞప్తి చేస్తాఉన్నా. ఈ నాలుగురోజులు కండ్లు మూసుకొని ఉంటే, ఈ మొత్తం రాష్ట్రాన్ని కాపాడుకున్నవాళ్లం అవుతాం. టు వీలర్ వద్ద పోయేవాళ్లు, మార్కెట్‌కు వెళ్లేవారు.. ఎక్కువ దూరం పోలేరు. ఎందుకంటే, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులున్నాయి. హైదరాబాద్ సిటీని దాటలేరు. కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ మూడు కిలోమీటర్ల లోపు షాపుల్లోనే కొనాలి.
రేపట్నుంచి రేషన్ పంపిణీ
గురువారం నుంచి బియ్యం సరఫరాచేస్తం. రూ.1500ను దళారీలు లేకుండా నేరుగా బ్యాంకుఖాతాల్లో వేస్తం. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించిన్రు. ఇంకా సేకరిస్తున్నరు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా అవి ఖర్చు పెట్టుకుంటరు. ఇట్ల ఈ పనులన్నీ ఉన్నతాధికారులు చూసుకోవాల్సి ఉన్నది. ప్రభుత్వం, క్యాబినెట్ నిర్ణయాలను అమలుచేయడంలో భాగంగా పాలు, కూరగాయలు, నిత్యావసరవస్తువులు ఎలా పంపిణీ చేయాలి, ఎలా సమన్వయం చేయాలి? మందుల సరఫరా, కరోనా పాజిటివ్ కేసుల చికిత్స, విదేశాల నుంచి వచ్చినవారి పరిస్థితి ఏంది? ఇలా అన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంది. ఇట్ల అన్ని అంశాలపై యం త్రాంగం ఒత్తిడిలో ఉంటది. ప్రజలు వాళ్లందరికీ సహకరిస్తేనే వాళ్లు మంచి సేవలు అందిస్తరు. పోలీసులు ఆపుతున్నరంటే మన కోసం, మన మేలు, బాగు కోసం ఆపుతున్నరుగానీ వాళ్లకు వ్యక్తిగతంగా వచ్చే మేలు ఏమీ లేదు.