నర్సు, ఆశా వర్కర్‌పై కరోనా పెషేంట్లు దాడి

తిరువనంతపురం : కేరళలో ఇద్దరు కరోనా పెషేంట్లు నర్సు, ఆశా వర్కర్‌పై దాడి చేశారు. ఒక రోగి ఏమో తనకు టీ తెచ్చేందుకు విఫలమయ్యారని నర్సుపై దాడి చేస్తే, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి పేరును ఉన్నతాధికారులకు నివేదించినందుకు అతను ఆశా వర్కర్‌పై దాడి చేశాడు. 


కొల్లాంలోని ఓ ఆస్పత్రిలో గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. తనకు టీ కావాలని కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. కుటుంబ సభ్యులు సమయానికి టీ తేకపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన అతను అక్కడున్న నర్సుపై దాడి చేశాడు. ఇతను హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించినప్పటికీ.. వీధుల్లో తిరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతన్ని ఆదివారం ఆస్పత్రిలో చేర్చారు. 


మరో 27 ఏళ్ల యువకుడు ఇటీవలే గల్ఫ్‌ నుంచి వచ్చాడు. అయితే అతను గల్ఫ్‌ నుంచి వచ్చాడని విధుల్లో ఉన్న ఆశా వర్కర్‌.. వైద్య శాఖ ఉన్నతాధికారులకు నివేదించింది. తన పేరును అధికారులకు ఎందుకు చెప్పావ్‌? అంటూ ఆమెపై అతను దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యువకుడు మొదట తప్పించుకున్నప్పటికీ.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని హోం క్వారంటైన్‌లో ఉంచి నిఘా పెట్టారు. 


ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు బయట తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చిచెప్పారు.