కరోనా నివారణ.. గ్రామాల్లో వింత ప్రచారం..!

సంగారెడ్డి: కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆకుంఠిత దీక్షతో శ్రమిస్తుంటే... మరోవైపు కరోనా బారీ నుంచి ఇలా తప్పించుకోవచ్చు అంటూ మారుమూల గ్రామాల్లో వింత ప్రచారం జరుగుతోంది. ఒక్కరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులందరూ ఐదు ఇళ్ల నుంచి తీసుకొచ్చిన నీటిని వేప చెట్టుకు పోస్తే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని నమ్మిన అమాయక మహిళలు.. ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అదంత అసత్యం అని.. ప్రజలు వాటిని నమ్మవద్దని అధికారులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు చెబుతున్నారు. మూఢ నమ్మకాలతో వైరస్‌ను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎవరి ఇళ్లలో వారుండటమే కరోనా వైరస్‌కు సరైన మందు అని చెబుతున్నారు. మూఢ నమ్మకాలపై గ్రామాల్లోని ప్రజలకు యువత అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.