ఓ జనం మీరు మారరా..!


  • జిల్లాలో రోడ్లపైకి వస్తున్న జనం 

  • ఆదివారం మాంసం, చికెన్‌ కోసం ఎగబడిన వైనం

  • గుంపులు గుంపులుగా గుమిగూడుతున్న ప్రజలు 

  • కూరగాయలు, కిరాణా దుకాణాల్లోనూ అదే పరిస్థితి

  • పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోని ప్రజలు


ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా ప్రజల్లో మార్పురావడంలేదు. వారి తీరూ మారడంలేదు. గుంపులు గుంపులుగా ఉండవద్దని, కనీస దూరం పాటించాలని పోలీసులు, అధికారులు పదే పదే చెబుతున్నా కొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టన్నాల్లో మాంసం, చికెన్‌, చేపల కోసం జనాలు ఎగబడ్డారు. అందరూ ఒకేచోట చేరడంతో మటన్‌, చికెన్‌, చేపల మార్కెట్‌లో రద్దీ నెలకొంది. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొందరు గుంపులుగా చేరి గండి కొడుతున్నారు. 


హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రభావం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించగా.. 23 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. జనతా కర్ఫ్యూ రోజున ప్రజలెవరూ బయటకు రాకుండా స్వీయ గృహనిర్బంధం పాటించారు. 23 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఆదివారం మాంసం, చికెన్‌, చేపల మార్కెట్లకు జనం ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అందరూ ఉదయం పూట ఒకేసారి మార్కెట్‌కు రావడంతో రద్దీ నెలకొంది. మటన్‌, చికెన్‌, చేపల మార్కెట్‌లో దుకాణాల ముందు కనీసదూరం పాటించాలనే నిబంధన అమలు కాలేదు. కొన్నిచోట్ల డబ్బాలు గీసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికివారు తామంటే తాము ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో జనాలు గుంపులు గుంపులుగా ఒకరిని ఆనుకొని మరొకరు ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కనీస దూరం పాటించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నది. గుంపులు గుంపులుగా జనాలు ఉండవద్దని, లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, కొందరు మాత్రం ఈ నిబంధనలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యంతో  వేలాది మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా, పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నా కొందరి నిర్వాహకంతో అసలుకే మోసం వస్తున్నది. కరోనా వ్యాప్తి కాకుండా స్వీయ నిర్బంధం అమలు చేస్తుండగా.. నిత్యావసరాలు, అత్యవసరాల కోసం కుటుంబంలో ఒకరిని బయటకు అనుమతిస్తుండగా, వీరు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కనీస దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకేచోటికి చేరుతున్నారు. కూరగాయల మార్కెట్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొనగా.. అధికారులు ఎక్కువ చోట్ల కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయించారు. మార్క్‌లు వేయించి కనీస దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. అధికారులు తీసుకున్న చర్యలతో కాస్త సమస్య తప్పినప్పటికీ ఆదివారం మటన్‌, చికెన్‌, చేపల మార్కెట్‌లో గుంపులు గుంపులుగా జనం ఎగబడ్డారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర, నిత్యావసర దుకాణాలకు ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇవ్వగా,ఈ సమయంలో మరికొన్ని దుకాణాలు కూడా తెరుస్తున్నారు. ఇక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉంటున్నారు. వైన్స్‌లు బంద్‌ ఉన్నప్పటికీ మద్యం మాత్రం అడ్డగోలు ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వైన్స్‌ల నుంచి రహస్యంగా తీసుకొని స్కూటీ డిక్కీల్లో పెట్టుకొని విక్రయిస్తున్నారు. రూ. వెయ్యి బాటిల్‌ను రూ. 2వేలు, రూ. 2వేల బాటిల్‌ను రూ. 4వేలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఫోన్లోలో నడుస్తుండగా, ముందుగానే ఒక ప్రదేశం ఎంచుకొని అక్కడికి వెళ్లి ఇస్తున్నారు.