ఈ నెల జీతాలకు కోతలేనా ?...


  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తమా?..

  • ఎమ్మెల్యేలకూ బందు పెట్టాల్సి వస్తుందేమో!

  • రెవెన్యూ పడిపోయింది.. చూసుకుని నడవాలి

  • గండం గట్టెక్కేదాకా ఎవరూ గుమిగూడొద్దు

  • లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందే

  • ఇలాంటి పరిస్థితి రావొద్దని దేవుణ్ని వేడుకోవాలి

  • రైతుల దగ్గర ప్రతి కేజీనీ మేమే కొంటాం

  • పౌరసరఫరాల శాఖకు రూ.25 వేల కోట్లు

  • వరి కొనుగోలుకు ఇంత ఇవ్వడం ఇప్పుడే: సీఎం

  • కరోనా నియంత్రణపై అత్యవసర సమీక్ష

  • కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌


మార్చి 15 నుంచి హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా ఉన్నది. పెట్రోల్‌, ఎక్సైజ్‌, జీఎస్టీ అన్నీ బందే కదా? అందుకే ఎమ్మెల్యేల జీతాలు కూడా బందు పెట్టాల్సి వస్తుందేమో? ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాలె కదా? కష్టం వస్తే అందరం పంచుకోవాలి కదా? ఇది లగ్జరీ పీరియడ్‌ కాదు. మనం విపత్తులో ఉన్నాం. అందరూ తగ్గించుకోవాలి. రెండు ముద్దల బదులు ఒక్క ముద్ద తినాలి. నాలుగు శాకాల (కూరల) బదులు రెండు తినాలి. రాష్ట్రానికి ఆదాయం తగ్గితేకేంద్రానికి తగ్గదా? వాళ్లది కూడా చేతికి మూతికి కొట్లాటే కదా? గండం గట్టెక్కే దాకా అందరం ఊపిరి బిగబట్టుకుని ఉండాలి.  కొంత నియంత్రణ పాటించాలి. అందరం కాంప్రమైజ్‌ అయినప్పుడే సమాజం బతుకుతుంది.





 





కల్లు లేకపోతే చస్తామా?


కల్లుకు అలవాటు పడిన వాళ్లకు ఇప్పటికే కౌన్సెలింగ్‌  ఇస్తున్నారు. కల్లు లేకపోతే లేకపోయింది. కల్లు లేకపోతే చస్తామా? కరోనా వస్తే చస్తాం కదా? 4 రోజులు చూద్దాం.


వలస కార్మికులను ఉపాసం ఉంచం!


ఇతర రాష్ట్రాలకు చెందిన 12,436 బృందాలు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అందులో 3.35 లక్షల మంది ఉన్నారు. ఇటుకబట్టీలు, భవన నిర్మాణం రంగం, హోటల్‌ తదితర రంగాల్లో పనిచేస్తున్నారు. ఒక్కొక్క వలస కార్మికుడికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించాం. తెలంగాణలోని ఏ ఒక్క వలస కార్మికుడూ ఉపాసం ఉండటానికి వీల్లేదు.


హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వం దగ్గర ధాన్యం కొనడానికి డబ్బుల్లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. రెవెన్యూ మొత్తం పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తమా?.. ఎంత ఇస్తాం.. అనే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల జీతాలు కూడా బందు పెట్టాల్సి వస్తుందేమో? కష్టం వస్తే అందరం పంచుకోవాలి కదా? రిజర్వ్‌ చూసుకుని నడవాలి. ఈ పరిస్థితి ఎప్పటిదాకా పోతుందో? ఎంతవరకూ పోతుందో తెలవదు.’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అఽధికారులతో ఆదివారం ఆయన ప్రగతిభవన్‌ నుంచి  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్‌ శాఖల కమిషనర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


అనంతరం మంత్రులు ఈటల రాజేందర్‌, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, తదితరులతో కలిసి సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘కరోనా వైర్‌సకు మందులేదు. ఈ గండం నుంచి బయటపడాలంటే మన చేతిలో ఉన్నది ఒకటే ఆయుధం. గండం గట్టెక్కేదాకా గుంపులుగా ఉండొద్దు. స్వీయనియంత్రణ, లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి. పోలీసు, వైద్య అధికారులకు పూర్తిగా సహకరించాలి. ఈ ఆయుధాన్ని ప్రయోగించాం. విజయవంతంగా ముందుకు పోతున్నాం. దక్షిణ కొరియాలో ఒకే ఒక వ్యక్తికి వైరస్‌ సోకింది. అది సోకినట్టు అతడికి కూడా తెలియదు. ఆ ఒక్కడి ద్వారా వేల మందికి వచ్చినట్టు లెక్కల్లో తేలింది. ఒక సూది మొన మీద కోట్లాది క్రిములు ఉంటాయి. అది చాలా ప్రమాదకరం.


జాగ్రత్తగా ఉండటమే తెలివైన పని’’ అని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. ‘‘ఈ గండం గట్టేక్కే దాకా బాగున్నామని ప్రజలు అనుకోవద్దు. ఏ దిక్కు నుంచి ఏం వస్తుందో తెలియదు. చాలా తీవ్రమైన క్రమశిక్షణ అవసరం. ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా సీరియ్‌సగా దాన్ని పాటించాలి’’ అన్నారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను అధికారులు రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారని, దాన్ని కొనసాగించాల్సిందిగా కలెక్టర్లకు చెప్పామని సీఎం తెలిపారు. 


11 మందికి నెగెటివ్‌ వచ్చింది!


కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా, వ్యవసాయం అనే రెండు అంశాలపై మాట్లాడినట్టు సీఎం తెలిపారు. ‘‘తెలంగాణలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70. వారిలో ఒక వ్యక్తి డిశ్చార్జ్‌ అయ్యాడు. అతడు ప్రధానితో కూడా మాట్లాడాడు. ‘గాంధీ ఆసుపత్రిలో బాగా చికిత్స అందించారు. గాంధీలో వైద్యులు, ఇతరులు కల్పించిన విశ్వాసమే నేను బతకడానికి తోడ్పడింది’ అని ఆ వ్యక్తి ప్రధానితో చెప్పాడు. చికిత్స పొందుతున్న వాళ్లలో పదకొండు మందికి నెగెటివ్‌ వచ్చింది. వాళ్లకు సోకిన వైరస్‌ పోయింది.


గాంధీ ఆసుపత్రిలో 11 మంది కోలుకున్నారని తుది రిపోర్టు వచ్చింది. ఫార్మాలిటీస్‌ అన్నీ చెక్‌ చేసి, సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారు. రిస్క్‌ తీసుకోరు. ఇక చికిత్స పొందుతున్న వాళ్లలో 58 మంది మిగులుతారు. వాళ్లంతా బాగానే ఉన్నారు. ఎవరి ఆరోగ్య పరిస్థితీ సీరియ్‌సగా లేదు. కిడ్నీ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఒకాయన ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంది. వరుసగా డిశ్చార్జ్‌ అయ్యేవాళ్ల వివరాలు తెలియజేస్తాం’’అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,932 మందిని నిఘాలో ఉంచామని.. చాలా మంది క్వారంటైన్‌ కటాఫ్‌ డేట్‌ పూర్తవుతోందని తెలిపారు. వారిని జిల్లా కలెక్టర్లు, వైద్యుల ఆధ్వర్యంలోని 5,746 బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రిఫర్‌ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కరోనాతో చనిపోయిన వ్యక్తి.. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి అని సీఎం తెలిపారు. ఇంకా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..


అప్పటికి ఎవరూ ఉండరు..


మార్చి 30 నుంచి క్వారంటైన్‌ కటాఫ్‌ డేట్‌ పూర్తవుతున్న వాళ్లు ఉన్నారు. 14 రోజుల క్వారంటైన్‌ టైమ్‌ పూర్తయుతే పర్యవేక్షణ కూడా అవసరంలేదు. ఏప్రిల్‌ ఏడు నాటికి అందరి టైం అయిపోతుంది. అప్పటికి ఎవరూ పేషెంట్లు ఉండరు. జీరో అవుతాం. మార్చి 30న 1899, 31న 1440, ఏప్రిల్‌ 1461, 2న 1887, 3న 1476, 4న 1453, 5న 914, 6న 454, 7న 397 మంది సమయం ముగుస్తుంది. ఏడు తర్వాత కరోనాతో సంబంధం ఉన్న వ్యక్తి మన దగ్గర ఉండరు. ఆలోపు అంతా డిశ్చార్జ్‌ అవుతారు. 10, 12 మంది ఉంటారు. కొత్త కేసులు చేరకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది. కొత్త కేసులు మనకు చేరే అవకాశం లేదు. ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు మూతపడ్డాయి. విదేశాల నుంచి వైర్‌సను మోసుకు వచ్చినవాళ్లు, విదేశాల నుంచి వచ్చి అనుమానితులుగా ఉన్న వాళ్లు అంతా కలిస్తే 25,932 మంది. కొత్త కేసులు రావద్దని భగవంతుడిని ప్రార్థిద్దాం. సమస్య తీవ్రత తగ్గిపోయే ఆస్కారం ఉంది. లాక్‌డౌనే మన ఆయుధం.  దాన్ని భారతదేశం సరిగ్గా ఉపయోగించినందునే ప్రజలు ప్రమాదానికి దూరంగా ఉన్నారు. 


శవాల మీద పేలాలు ఏరుకోవద్దు


బియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నాం. పోర్టబులిటీ ఉంది. ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చిల్లర రాజకీయాలు ఎందుకు? శవాలమీద పేలాలు ఏరుకునుడే వద్దు అంటున్నా. దీంట్లో కూడా దొంగతం చేస్తే వాళ్లకు కరోనా తగులుతుంది. సర్పంచ్‌ కర్రపట్టుకుని నిలబడితే దొంగతనం జరుగుతుందా?


ప్రభుత్వమే కొంటుంది


తెలంగాణలో పండే ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది. లక్షల క్వింటాళ్లు వచ్చినా 100 శాతం కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కరోనా ప్రబలకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని మార్కెట్లకు తాళాలు వేశాం. మార్కెట్‌ శాఖ సిబ్బంది ఊర్లలోనే ఉంటారు. మొత్తం ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన నియంత్రిత కొనుగోలు కేంద్రాల్లోనే కొంటాం. ఎక్కువ మంది గుమికూడొద్దనే మార్కెట్లను మూసేశాం. ఐదారు రోజుల్లో ప్రతి రైతుకూ కూపన్‌లు ఇస్తారు. అందులో పేర్కొన్న తేదీ నాడే కొనుగోలు కేంద్రాలకు రైతులు రావాలి. క్రమశిక్షణ పాటిస్తేనే కరోనా బారిన పడకుండా ఉంటారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు పాస్‌బుక్‌, బ్యాంకు ఖాతా బుక్‌ తీసుకురావాలి. డబ్బులు ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతాలో పడతాయి. వరి కోసే హార్వెస్టర్ల మెకానిక్‌లను సోమవారం నుంచి గ్రామాలకు పంపాలని అధికారులను ఆదేశించాం.


వారికి పాస్‌లను మంజూరు చేయాలని పోలీస్‌ శాఖకు నిర్దేశించాం. రాష్ట్రం ఇంత కఠిన పరిస్థితుల్లో ఉన్నా.. వరి కొనుగోలుకు పౌరసరపరాల శాఖకు రూ.25వేల కోట్లు, మొక్కజొన్న కొనుగోలుకు రూ.3200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు ఇచ్చాం. రాష్ట్రంలో పండే మామిడి, నిమ్మ, సంత్రా, దానిమ్మ, బత్తాయి పండ్లను మనమే తిందాం. పండ్లు తెచ్చే వాహనాలకు ఉద్యానవన శాఖ అనుమతి ఇవ్వాలి. రాష్ట్రంలో 500 కేంద్రాల్లో పండ్లు అమ్మాలని చెప్పాం.