పుణె నర్సుకు ప్రధాని అభినందనలు


పుణె, దిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న నాయుడు ఆసుపత్రికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. మహమ్మారిపై పోరులో ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ఆసుపత్రి నర్సు చయ్యా జగతాప్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఫోన్‌కాల్‌ వచ్చిందని పుణె నగరపాలక సంస్థకు చెందిన ఆరోగ్య విభాగం అధికారి ఒకరు శనివారం తెలిపారు. ప్రధానమంత్రి, నర్సుకు మధ్య జరిగిన సంభాషణ ఆడియో ప్రస్తుతం సామాజిక మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ముందుగా మరాఠీలో సంభాషణను ప్రారంభించిన ప్రధానమంత్రి నర్సు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగతాప్‌ అంకితభావాన్ని మోదీ కొనియాడారు.


‘ఆయుష్‌’ ప్రతినిధులకు సూచనలు
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాలు (శానిటైజర్లు) వంటి వాటికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడినందున వాటిని ఉత్పత్తి చేసేందుకు యత్నించాలని ఆయుష్‌ ఔషధాల ఉత్పత్తిదారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఆయుష్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయుర్వేదం, యునానీ, సిద్ది, హోమియోపతిలు ఆయుష్‌ కిందకు వస్తాయి.