వయసు కాదు.. ఆరోగ్యమే కీలకం


వాషింగ్టన్‌, మార్చి 30: కరోనావైరస్‌ బాధితుల్లో వృద్ధులు ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వృద్ధులకు మాత్రమే పరిమితం కాలేదనీ, అన్ని వయసుల వారిలోనూ ఎక్కువగానే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కరోనా సోకడానికి ముందు వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది ముఖ్యమైన అం శంగా నిపుణులు భావిస్తున్నారు. కరోనా బాధితుల్లో 50 ఏళ్లలోపు వయసువారు 10-15ు మంది ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఫ్రాన్స్‌లో తొలిదశలో కరోనా బాధితుల్లో సగం మందికిపైనే 60 ఏళ్లలోపు వారున్నారు.


 





ఇటలీలో నాలుగోవంతు కరోనా వ్యాధిగ్రస్తులు 19-50ఏళ్ల మధ్య వయసువారే. స్పెయిన్‌లోనూ మూడోవంతు బాధితులు 44 ఏళ్లలోపు వారున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న అమెరికాలోనూ 29ు మంది కరోనా బాధితులు 20-44 ఏళ్ల మధ్య వారేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల బాధితుల వయసు కంటే అంతకు ముందు ఆరోగ్య సమస్యలే జబ్బు తీవ్రతను నిర్ణయిస్తున్నాయని కెనడాలోని డల్హౌసీ వర్సిటీ పరిశోధన చెబుతోంది. ఉదాహరణకు చైనాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో 40ు మందికి ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిసింది.