న్యూఢిల్లీ: కరోనా వైరస్ కన్నా అది సోకుతుందేమోనన్న భయం ఇంకా పెద్ద సమస్యగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికుల వలసల ను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న దృష్ట్యా తాము మరిన్ని ఆదేశాలిచ్చి అయోమయం సృష్టించబోమని సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. 50 ఏళ్లు దాటిన ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. షుగర్, బీపీతో బాధపడుతున్న ఖైదీలను విడుదల చేయాలని కోరారు. కరోనాలో పనిచేస్తున్న మీడియా సిబ్బందికి రూ.50 లక్షల చొప్పున వైద్య/జీవిత బీమా కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది.