- అందరూ ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లినవారే
- ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా చెప్పండి
- వారికీ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది
- ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి
- కొత్తగా 6.. మొత్తం 76కు పెరిగిన కేసులు
- కరీంనగర్‌కు చెందిన తల్లీ కూతుళ్లకు పాజిటివ్
- నిలోఫర్‌లో మూడేళ్ల పాపకు సోకిన కరోనా
- గాంధీ ఆస్పత్రి నుంచి 13 మంది డిశ్చార్జి
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆదివారం వరకు ఒకే మరణం నమోదవగా... ఒక్క రోజే ఐదుగురు చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో, అపోలో, గ్లోబల్ ఆస్పత్రులు, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను అయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందిస్తుంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. వారి గురించి సమాచారం ఎవరికి తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతోందని ఆ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ, మర్కజ్ వెళ్లొచ్చిన నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తికి చెందిన 11 మందిని, యాదాద్రి భువనగిరి జిల్లావాసులు 14 మందిని, వనపర్తికి చెందిన 65 ఏళ్ల వ్యక్తిని కూడా ఐసోలేషన్ వార్డులకు తరలించారు.
మరో 6 కేసులు నమోదు
సోమవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 76కు చేరింది. అయితే ఆరుగురు కరోనాతో చనిపోవడం, 14 మందిని డిశ్చార్జి చేయడంతో ప్రస్తుతం 56 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరీంనగర్‌లో ఇండోనేషియా బృందంతో కలసి తిరిగిన ఓ యువకుడికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా అతని తల్లి, సోదరికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందులో ముగ్గురు ఐదేళ్లలోపు వారు. ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే కరోనా బయటపడింది. మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లాలో 105 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఒకరే చనిపోయారని వెల్లడించిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో ఆరుగురు మరణించినట్లు తెలిపారు.
ఇక సోమవారం 13 మందిని డిశ్చార్జి చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు తప్ప వారెవరో కూడా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. ఇండోనేషియా బృందంతో పాటు తిరిగిన మరో ఇద్దరిని కలుపుకొంటే 11 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన యువతి, హైదరాబాద్ నగరానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.