-కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలున్నాయి
-పోలియో, మశూచిని జయించి ప్రపంచానికే మార్గం చూపింది
-ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబు
జెనీవా: కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చేపడుతున్న అసాధారణ, కఠిన చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో పోలియో, మశూచి (స్మాల్‌పాక్స్) వంటి పెద్ద మహమ్మారులను జయించిన భారత్ ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కితాబిచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ భారత్‌కు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూను’ ప్రజలంతా కలిసి విజయవంతం చేసిన నేపథ్యంలో సోమవారం జెనీవాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశమైన భారత్‌కు కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. 1977లో మశూచిని పూర్తిగా అరికట్టిన భారత్, 2014లో పోలియో రహిత దేశంగా నిలిచింది.
వైరస్ వేగంగా వ్యాపిస్తోంది: టెడ్రోస్
కరోనా వేగంగా వ్యాప్తిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా శరవేగంతో వ్యాపిస్తున్నది. 67 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తొలి దశలో లక్ష మందికి వైరస్ సోకింది. అనంతరం రెండో దశలో 11 రోజుల్లోనే మరో లక్ష మందికి వ్యాపించింది. మూడో దశలో కేవలం నాలుగు రోజుల్లో మరో లక్ష మందికి వైరస్ సోకింది. 15 వేలకుపైగా మరణించారు’ అని టేడ్రోస్ పేర్కొన్నారు. చాలా దేశాల్లో వెలుగులోకిరాని కేసులు పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చన్నారు. అయినా కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమేనని భరోసా ఇచ్చారు. కరోనా వ్యాప్తిని తప్పించుకోవడం (డిఫెండింగ్ ) మాత్రమే సరిపోదని, ఫుట్‌బాల్ క్రీడ మాదిరిగా డిఫెండింగ్‌తోపాటు అటాక్ చేయాల్సి ఉందని, ఆ మేరకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
‘జనతా కర్ఫ్యూ’ స్ఫూర్తిదాయకం: అమెరికా
వాషింగ్టన్: భారత్ చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’ స్ఫూర్తిదాయకమని అమెరికా ప్రశంసించింది. ప్రధాని మోదీ పిలుపుతో ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేయడం, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం ప్రకటించడం స్ఫూర్తిదాయకమని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయక కార్యదర్శి ఆలీస్ జీ వెల్స్ ట్విట్టర్‌లో ప్రశంసించారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సోమవారం అక్కడి భారతీయ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారతీయ కంపెనీలు స్థానిక ప్రజలకు ఎంతో అండగా ఉంటున్నాయని కొనియాడారు.