అందరూ భయం గుప్పిట్లో చిక్కుకుపోతే ఎలా? కొందరైనా ధైర్యంగా నిలబడాలికదా! ఓదార్పు అందించేవాళ్లు కూడా ఉండాలి కదా. పాప్‌గాయని రాబిన్ రిహాన్నా ఈ కోవకే చెందుతుంది. వైరస్‌తో విలవిల్లాడుతున్న అమెరికాకు తన వంతు సాయంగా 38 కోట్ల రూపాయలను అందించి తన పెద్ద మనసును చాటుకుంది...
రిహాన్నా గొంతులాగే మనసు కూడా తీయనిదే అంటారు ఆమె గురించి తెలిసిన వారందరూ. ఈ పాప్ ఐకాన్ మధుర స్వరానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. మరోవైపు సామాజిక సేవలోనూ చురుగ్గా ఉంటుందామె. ఎనిమిదేళ్లక్రితం తన అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థంగా ‘ద క్లారా లయొనెల్ ఫౌండేషన్’ను స్థాపించి... నిరుపేదలకు సేవలందిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితులకు, వారికి వైద్యసేవలందిస్తున్న సిబ్బందికి 38 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ‘ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న వైద్యసిబ్బందిని కాపాడుకునే బాధ్యత మనదే’ అనే రిహాన్నా ఫుడ్‌బ్యాంకులు, వ్యాధి నిర్ధారణ కిట్‌లు, ఆరోగ్యశాఖ కార్యకర్తల శిక్షణకు, వైద్య పరికరాలకు ఈ సాయం అందిస్తోంది. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుసంపాదించుకున్న ఈ గాయని... ఇప్పటివరకు తొమ్మిది గ్రామీ అవార్డులు సొంతం చేసుకుంది.