45 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షను వేగంగా చేపట్టే ఒక విధానానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. 45 నిమిషాల్లోనే ఇది ఫలితాన్ని అందిస్తుంది. పైగా ఈ పరీక్ష కోసం ఎక్కడో ఉన్న ల్యాబ్‌కు నమూనాను పంపాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లోనూ చేయించుకోవచ్చు. కాలిఫోర్నియాకు చెందిన సెఫిడ్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. కరోనా సోకిన వారిని వేగంగా గుర్తించి, చికిత్స చేయడానికి, విడిగా ఉంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ నెల 30 నాటికి ఈ కొత్త పరీక్షను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సెఫిడ్‌ తెలిపింది.