మాస్కుల కోసం 4.11 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వైద్యుడు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి)  : వైరస్‌ భయాన్ని సైబర్‌ దొంగలు తమకుఅనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇటీవల ఓ డాక్టర్‌ను దోచుకున్నారు. చార్మినార్‌కు చెందిన అంకాలజిస్ట్‌ డాక్టర్‌ షేక్‌ సమద్‌ అబ్దుల్‌ ఆన్‌లైన్‌ ద్వారా మాస్కులను కొనుగోలు చేయాలని భావించారు. అలీబాబా వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేశారు. నిమిషాల వ్యవధిలో డాక్టర్‌ మొబైల్‌కు ఓ ఆగంతుకుడి నుంచి ఫోన్‌ వచ్చింది. అలీబాబా వెబ్‌సైట్‌ ద్వారా మాస్కులు విక్రయిస్తుంటామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన డాక్టర్‌ అబ్దుల్‌ 50 బాక్సుల మాస్కులు కావాలన్నారు.రూ. 15 లక్షలు అవుతుందని ముందుగా 30 శాతం అడ్వాన్స్‌ చెల్లించాలని ఆగంతుకుడు చెప్పాడు. దీంతో అతడు చెప్పిన బ్యాంకు ఖాతాకు వైద్యుడు 4.11 లక్షల రూపాయలు రెండు విడతలుగా పంపించాడు. ఆ తర్వాతి నుంచి ఆగంతుకుడి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో డాక్టర్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.