న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వేధిస్తోంది. ఇది సీజనల్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్‌తో సమానంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాలతో ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రభుత్వాలకు, వైద్య నిపుణులకు పెను సవాలు తప్పదు. అంటు వ్యాధుల విషయంలో అమెరికాకు చెందిన అగ్ర శ్రేణి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాతుడూ అమెరికన్లు రెండో దశ నోవల్ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘ఇది కాలాన్నిబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇది ఆ విధంగా రావడానికి చాలా అవకాశం ఉందనే నేను ఎల్లప్పుడూ చెబుతాను’’ అన్నారు.
ఫౌసీ కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో వైట్ హౌస్ మెడికల్ రెస్పాన్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ కూడా. దక్షిణార్ధ గోళంలో కనిపిస్తున్న మహమ్మారులకు చాలా ప్రాధాన్యం ఉందని, ఈ ప్రాంతంలోని దేశాలు శీతాకాలంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ఇది తీవ్రమైన మహమ్మారి అయితే, మనం రెండోసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండక తప్పదన్నారు. భారత దేశంలో వేసవి కాలపు ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తికి సహజసిద్ధమైన అడ్డంకిగా నిలుస్తాయా? అనేది వేచి చూడాలి. గతంలో కరోనా వైరస్‌లు కాలాన్నిబట్టి విరుచుకుపడటం కనిపించింది. కానీ అన్ని వైరస్‌లు అదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ప్రస్తుత నోవల్ కరోనా వైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అంటారు. దీని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు గతంలో కనిపించిన కరోనా వైరస్ మహమ్మారులపై ఆధారపడినవే. రాబోయే నెలల్లో మన దేశంలో వేసవి కాలం రానుండటంతో, ఆ ఉష్ణోగ్రతల కారణంగా ఈ కొత్త వైరస్ నాశనమవుతుందో, లేదో వేచి చూడాలి.
వేసవి కాలం పూర్తయిన తర్వాత వర్షాకాలంలో మరోసారి ఈ మహమ్మారి సవాలును ఎదుర్కొనక తప్పకపోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఇవన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఊహాజనితమని, నిర్థరించి చెప్పడానికి తగిన ఆధారాలేవీ లేవని అంటున్నారు.