ప్రపంచ వ్యాప్తంగా కరోనా పేషెంట్ల సంఖ్య: 558,946
వారిలో కోలుకున్న వారు: 128,754
మరణాల సంఖ్య: 25,270
భారత్ లో పేషెంట్లు: 879
కోలుకున్న వారు: 74
మృతులు: 19
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరప్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అన్ని దేశాల కన్నా ఇటలీ కకావికలమైపోతోంది. దాదాపు 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ప్రపంచంలోనే అత్యధికంగా 8,215 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి ఒక ఆశాదీపంలా నిలిచాడు ఓ 101 ఏళ్ల తాత. కరోనా మహమ్మారితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలోని రిమిని సిటీలో ఈ ఘటన జరిగింది.
1919లో పుట్టిన మిస్టర్ పి అనే వృద్దుడు కొద్ది రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. వందేళ్లు దాటిన ఈ తాత కోలుకుని కుటుంబసభ్యులతో బుధవారం నాడు హాయిగా ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని రుమిని సిటీ వైస్ మేయర్ గ్లోరియా లిసీ ప్రకటించారు. కొన్ని వారాలుగా ప్రతి రోజు దీనగాథలే చూసి అలసిపోయాం. ముఖ్యం వృద్ధులనే ఎక్కువగా బలితీసుకుంటున్న ఈ వైరస్ పై 101 ఏళ్ల మిస్టర్ పి విజయం సాధించాడు. ఇప్పుడు అతడు మా దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నాడు అని చెప్పారాయన. ఈ కష్ట కాలంలో ఇది ఒక్క ఇటలీకే కాదు యావత్ ప్రపంచానికి ఒక శుభవార్త అని, 100 ఏళ్లు పైబడిన వాళ్లు సైతం కరోనా నుంచి కోలుకోగలరని రుజువైందని అన్నారు.