పారిశుద్ధ్య పనులు మెరుగుపడాలి: కలెక్టర్‌


మణుగూరు కమిషనర్‌ వెంకటస్వామితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, విప్‌ రేగా కాంతారావు

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు పట్టణంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు గురువారం మణుగూరు వచ్చారు. భగత్‌సింగ్‌నగర్‌లో పట్టణ ప్రగతి పనుల్ని కలెక్టర్‌ పరిశీలించారు. మురుగు కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవటంపై కమిషనర్‌ వెంకటస్వామి, సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. మూడు రోజులకోసారి మురుగు కాలువల్ని శుభ్రం చేస్తే ఇలా ఎందుకు ఉంటుందని అడిగారు. పట్టణంలో ఎంతమంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని తెలుసుకున్నారు. పురపాలకానికి ఆదాయం లేక కార్మికుల సంఖ్య తక్కువగా ఉందంటూ కోర్టు వివాదాలను కలెక్టర్‌కు కమిషనర్‌ వివరించారు. ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారా అని కలెక్టర్‌ ప్రశ్నించగా ప్రస్తుతం అలానే వసూలు చేస్తున్నామని పురపాలక అధికారులు తెలిపారు. ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లు, వాణిజ్య భవనాలకు విధిస్తున్న ఆస్తి పన్నుల పూర్తి వివరాలను సమగ్రంగా తెలియచేయాలని ఆదేశించారు. పట్టణంలో శ్మశాన వాటిక, వైకుఠంధామం, పార్కు, కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను సేకరించేందుకు సర్వే చేయించాలని తహసీల్దార్‌ నారాయణమూర్తిని ఆదేశించారు. స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు, యువతీ, యువకులు ఉపాధి పొందేందుకు మూడు నెలలపాటు వృత్తి కోర్సుల్లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. నిరక్ష్యరాస్యులకు ప్రత్యేకంగా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేసి విద్య నేర్పిస్తామన్నారు. విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఏఎస్పీ షబరీశ్‌, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి రాములు, సీఐ షుకూర్‌, ఎంపీపీ కారం విజయకుమారి, ఏడీఈ జీవన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.