బీసీల దేవుడు కేసీఆర్‌..

 




 
 

 
 







 


నిరుపేద కుటుంబంలో జననం..


మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బోనకల్లు మండలం ఆవులపాడు గ్రామానికి చెందిన తాను ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టానని చెప్పారు. తండ్రి కురాకుల లక్ష్మయ్య, తల్లి భూలక్ష్మికి మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా, తాను ఆరవ వాడినని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారని తెలిపారు. ఆయన అమ్మమ్మ స్వగ్రామం అయిన ప్రస్తుత రఘునాథపాలెం మండల పరిధిలోని వీ వెంకటాయపాలెం గ్రామంలో కుటుంబంతో సహా వలస వచ్చామని, వారిచ్చిన మూడు ఎకరాల పొలం ఆధారంగా తన కుటుంబం జీవనం సాగించిందని చెప్పారు.


 


గొర్రెల కాపరిగా..


కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను పాఠశాలకు వెళ్లలేక పోయానని నాగభూషణం పేర్కొన్నారు. మొదట్నుంచీ పేదరికంలో కొట్టుమిట్టాడిన కారణంగా తనకు ఊహ తెలిసిన వెంటనే జీవాల (గొర్రెల) కాపరిగా పంపారన్నారు. చదువుపై మమకారంతో కాపరీగానే ఉంటూ రాత్రి బడికి (వయోజన విద్య) వెళ్లేవాడినని, ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు చదువుకున్నానని చెప్పారు. వీవీపాలెం గ్రామంలోనే ఒక రైతు వద్ద ‘పాలేరుగా’ కుదిరి దాదాపు నాలుగేళ్లుగా పనిచేశానని తెలిపారు. అదే సమయంలో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ నిర్మాణం జరుగుతుండగా రోజువారీ కూలీగా 10 సంవత్సరాలు కష్టపడ్డానని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నరు. వీవీ పాలెం గ్రామానికి చెందిన ధనలక్ష్మితో తనకు వివాహం జరిగిందని, తన చిత్తశుద్ధికి మెచ్చిన నాటి సర్కారు ఎన్నెస్పీ కాలువకు లస్కర్‌గా నియమించిందన్నారు. కేవలం రూ. 270ల నెలవారీ వేతనంతో రూ. వేలు వచ్చేవరకు దాదాపు 18 సంవత్సరాలు విధులు నిర్వర్తించానని ‘కురాకుల’ స్పష్టంచేశారు.


 


రియల్‌ ఎస్టేట్‌ వైపు అడుగులు..


ఎన్నెస్పీలో లస్కర్‌గా పనిచేస్తున్న క్రమంలో తనకు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆసక్తి కలిగిందని డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం పేర్కొన్నారు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక వ్యాపారి దగ్గర ఏజెంట్‌గా కుదిరానని, అనతికాలంలో సొంతంగా వ్యాపారం చేయటం ప్రారంభించానని తెలిపారు. గత 1980వ దశకంలో భూముల ధరలు తక్కువగా ఉన్నందున సంపాదించే ప్రతీ పైసాను భూమి మీదనే పెట్టుబడిగా పెట్టానని వెల్లడించారు. అదే తనకు అదృష్టంగా మారిందన్నారు. 


 


ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు..


వ్యాపారంలో రాణించటం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో ‘కురాకుల నాగభూషణం’ అడుగులు సామాజిక సేవల దిశగా పడ్డాయి. తొలుత ఖమ్మం జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూనే, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానంగా యాదవ సామాజిక వర్గంలో చదవుకుంటూ ఉద్యోగాలు, ఇతర అన్ని రకాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం దాదాపు రూ.కోటి అంచనా వ్యయంతో ప్రత్యేక వసతి భవనాన్ని నిర్మించటంలో కీలకపాత్ర పోషించారు. దానికిగానూ వెయ్యి గజాల తన సొంత స్థలాన్ని విరాళంగా అందజేశారు. పుట్టిన ఊరికి ఉపకారం చేయాలనే తలంపుతో బోనకల్లు మండలం ఆవులపాడు గ్రామంలో పాఠశాల అదనపు తరగదుల నిర్మాణానికి గాను మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. యాదవ ప్రముఖుల సహకారంతో రఘునాథపాలెం మండలం వీవీ పాలెం గ్రామంలో గ్రంథాలయ భవనం, భద్రాచలంలో రాములోరి గుడికి సమీపాన కృష్ణుడి మందిరం, అక్కడే మూడు ఏసీ గదులు, ఒక సాధారణ గది నిర్మాణానికి సహకరించానని వివరించారు. నిరుపేద విద్యార్థుల చదువుకు చేయూత, ఆలయాల నిర్మాణానికి వెన్నుదన్నుగా నిలవటం అలవాటుగా చేసుకున్నానని చెప్పారు.


 


రాజకీయ అరంగేట్రం..


వ్యాపారం, సామాజిక కార్యక్రమాల్లో దూసుకుపోతున్న తనకు రాజకీయాల్లోకి రావాలంటూ ఒక పార్టీ నుంచి పిలుపు వచ్చిందని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ నూతన చైర్మన్‌ కూరాకుల నాగభూషణం వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి ఖమ్మం అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలయ్యానని తెలిపారు. అనంతరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా ఆవిష్కరించేందుకు ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై 2016వ సంవత్సరంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరానని పేర్కొన్నారు. అక్కడి నుంచి తాను ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. గత 2016 మార్చిలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో తన కుమారుడు ‘కూరాకుల వలరాజు’ 8వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా పోటీచేసి విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 


 


ఇష్టమైన నాయకుడు సీఎం కేసీఆర్‌..


భారతదేశంలో తనకు నచ్చిన, తాను మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్‌ ఒక్కరే అని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. బీసీలపై ఉన్న మమకారంతోనే తనకు అగ్రపీఠాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ బీసీల దేవుడన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి రెండు అంశాలను పరుగులు పెట్టిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ కార్యదక్షత ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఒక వైపు టీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యతలు, మరోవైపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న నాయకుడు ‘కేటీఆర్‌' అని కీర్తించారు. 


 


మాట నిలబెట్టుకున్న నేత ‘పువ్వాడ’..


చదువులో చెప్పుకోదగిన ప్రావీణ్యత లేకపోయినా తనపై నమ్మకంతో డీసీసీబీ చైర్మన్‌ పదవి తనకు కట్టబెట్టడంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషిని ఎన్నటికీ మరిచిపోనని డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం అన్నారు. యాదవసంఘం మహాసభలు, వనభోజనాలు, ఇతర కార్యక్రమాలకు వచ్చినప్పుడు మంత్రి అజయ్‌ తనను అగ్రభాగాన నిలబెడతానని తరచూ అనేవారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, అనేక ఒత్తిడులు వచ్చినప్పటికీ, ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం చలించక తనకు డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇప్పించిన మంత్రి అజయ్‌కి జన్మజన్మలా రుణపడి ఉంటానని అన్నారు. 


 


రైతుల సంక్షేమమే ధ్యేయం..


తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలని.. అన్నదాత లోగిళ్లను సంతోషాలమయం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. దీనిలో భాగంగానే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూనే, దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆశయాల స్ఫూర్తిగా తాను కూడా ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దిశానిర్దేశంలో డీసీసీబీ డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సలహాలు, సూచనలతో చక్కని పాలన అందిస్తామన్నారు. ప్రధానంగా అన్నివర్గాల రైతులకు బ్యాంకు రుణాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని స్పష్టం చేశారు.