పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు
అందుకు ప్రతిబంధకం కాదు
నిర్భయ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: నిర్భయ దోషుల మరణ శిక్ష అమలు విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేంద్రం, దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు తమ వద్ద పెండింగులో ఉన్నప్పటికీ.. ఉరితీతకు విచారణ న్యాయస్థానం కొత్త తేదీని నిర్ణయించవచ్చని స్పష్టం చేసింది. విచారణ న్యాయస్థానాన్ని సంప్రదించే స్వేచ్ఛను అధికారులకు కల్పించింది. నిర్భయ దోషుల మరణ శిక్ష అమలుపై స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దానిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది.
కేంద్రం, దిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మరణ శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా ఇప్పటికీ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదని, రాష్ట్రపతిని క్షమాభిక్ష కూడా కోరలేదని తెలిపారు. ఉరితీత అనేది ‘సంతోషం’ కోసం చేయాలనుకుంటున్న పని కాదని, అధికారులు కేవలం చట్టం ఆదేశాలను అమలు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దోషుల అపీళ్లను 2017లోనే సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ, అధికారులు ఇప్పటికీ వారిని ఉరి తీయలేక నిస్సహాయులుగా ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం సమాజంపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. హైదరాబాద్‌లో ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ ఉదంతాన్ని మెహతా ప్రస్తావించారు. ‘‘ఆ ఎన్‌కౌంటర్ తర్వాత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వ్యవస్థపై వారిలో విశ్వాసం సన్నగిల్లుతుండటమే అందుకు కారణం. ఇలాంటి పరిణామాలు మన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల పిటిషన్లపై స్పందన తెలపాలని నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు తాఖీదులు జారీ చేసింది. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని దోషుల్లో ఒకడైన వినయ్‌కుమార్‌శర్మ సుప్రీంలో సవాలు చేశాడు. మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేశాడు.