ప్రత్యర్థులను ఊడ్చేసిన చీపురు
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం
70 స్థానాల్లో 62 చోట్ల గెలుపు
8కి పెరిగిన భాజపా సీట్లు
బోణీ కొట్టలేక చతికిలపడ్డ కాంగ్రెస్
భారత్ మాతాకి జై... ఇంక్విలాబ్ జిందాబాద్... ఐ లవ్ యూ దిల్లీ. మీరిచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో దిల్లీలో ‘చేతల రాజకీయం’ జన్మించింది. నన్ను తమ కుమారుడిగా భావించిన ప్రజల గెలుపు ఇది. హనుమంతుడు మనల్ని దీవించారు. దిల్లీకి మరింత సేవ చేయడానికి దేవుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించిన, ప్రజలకు నిరంతరం చౌక విద్యుత్తును అందిస్తున్న పార్టీకి ప్రజలు ఇచ్చిన కానుక ఇది.
- అరవింద్ కేజ్రీవాల్
ఒంటి చేత్తో కేజ్రీవాల్ అందర్నీ ఊడ్చిపడేశారు. ‘చీపురు’ ధాటికి జాతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దిల్లీని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఏకంగా 240 మంది ఎంపీలను కమలనాథులు రంగంలోకి దింపినా కేజ్రీ దీటుగా బదులిచ్చారు. ఐదేళ్లు గడిచినా.. ‘మఫ్లర్ వాలా’పై దిల్లీ ఓటర్లలో వీసమెత్తు అభిమానం సడలలేదని రుజువైంది. ముచ్చటగా మూడోసారి హస్తినను ఆమ్‌ఆద్మీ హస్తగతం చేసుకుంది. ఆప్‌కు గంపగుత్తగా 62 సీట్లు దక్కాయి. గత ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన భాజపా.. ఈసారి మరో 5 సీట్లు దక్కించుకోవడమే ఆ పార్టీకి దక్కిన ఊరట. కాంగ్రెస్ ఇప్పుడూ ఖాతా తెరవలేక చతికిలపడింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయదుందుభి మోగించింది. పోటాపోటీగా సాగిన శాసనసభ ఎన్నికల సమరంలో చీపురు గుర్తు పార్టీ తన ప్రత్యర్థులను ఊడ్చేసింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో 70కి గానూ 62 చోట్ల ఆప్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. వరసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టి, హ్యాట్రిక్ సాధించిన పార్టీగా ఆప్ నిలిచింది. తొమ్మిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ పరిధిలోని ఏడు సీట్లనూ భాజపా సొంతం చేసుకున్నా, శాసనసభ వద్దకు వచ్చేసరికి ఆప్ ముందు నిలవలేకపోయింది. కాకపోతే 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలకు పరిమితం కాగా ఈసారి 8 చోట్ల గెలిచింది. ఆ మేరకు ఆప్ నుంచి 5 స్థానాలు అదనంగా గెలుచుకుంది. ఎటుతిరిగీ కాంగ్రెస్ మాత్రం అత్యధిక చోట్ల ధరావతునైనా దక్కించుకోలేక చతికిలపడిపోయింది. వరసగా రెండు ఎన్నికల్లో హస్తానికి దిల్లీలో బోణీ లభించలేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగిన ఆందోళనల నేపథ్యంలో ఈ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా అవి పూర్తిగా అడియాశలయ్యాయి. ముందు నుంచీ పకడ్బందీ ప్రణాళికతో పావులు కదిపి, తనదైన ప్రత్యేక పథకాలు అమలు చేసిన ఆప్ విజయవంతంగా రెండు జాతీయ పార్టీలనూ కకావికలం చేయగలిగింది. అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్లుగానే అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 14న, లేదా 16న ఆయన ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఫలితాల సరళి తెలియగానే దిల్లీ అంతగా ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సహా అనేకమంది నేతలు కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంచుమించు గతంలో మాదిరిగానే
కేజ్రీవాల్ దాదాపుగా 2015 స్థాయి విజయాన్ని ఈసారి పునరావృతం చేయగలిగారు. ఆప్ అప్పుడు 67 సీట్లు గెలుచుకుంది. సాధించిన అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలు... ఈ రెండింటిపై కేజ్రీవాల్ ఈసారి ఆధారపడి సునాయాసంగా గెలుపు తీరాన్ని చేరుకోగలిగారు. కొత్తదిల్లీ స్థానంలో భాజపా అభ్యర్థిపై కేజ్రీవాల్ నెగ్గారు. పార్టీలో కీలక నేతలైన సిసోడియా, రాఘవ్ ఛద్దా, గోపాల్‌రాయ్, సత్యేంద్ర జైన్ తదితరులంతా విజయం సాధించారు. విపక్ష నేతలంతా ఆమ్ ఆద్మీ విజయాన్ని స్వాగతించారు. విభజనవాద, విద్వేష రాజకీయాలపై సమ్మిళిత రాజకీయాలు సాధించిన విజయంగా దీనిని అభివర్ణించారు. అభివృద్ధి నినాదంపై ఎన్నికల్లో పోరాడి విజయం సాధించవచ్చని చెప్పడానికి ఈ ఎన్నికలే తార్కాణమని భాజపాయేతర పక్షాలన్నీ పేర్కొన్నాయి. భాజపాని గద్దె దించాలంటే ప్రాంతీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగంలో సాధించిన విజయాలను ఓటర్ల ముందుంచి, వారి దీవెనలను ఆప్ పొందగలిగింది. తెలుపు, నీలి రంగు బుడగలను చేతపట్టి ఆప్ ప్రధాన కార్యాలయం సహా హస్తిన అంతటా కార్యకర్తలు జయజయధ్వానాలు చేశారు. పార్టీ ప్రచారంలో వినియోగించిన ‘లగేరహో కేజ్రీవాల్’ పాట, డప్పుల దరువులతో దిల్లీ హోరెత్తింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ లడ్డూలు తినిపించుకున్నారు.