భద్రాచలం: తపాలా శాఖ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ముఖ్య అతిథులు చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సంధ్యారాణి, పోస్టు మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా శాఖ సూపరింటెండెంట్ ఎల్లమందయ్య అధ్యక్షతన భద్రాచలంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ప్రతీచోట పొదుపును ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణులకు ఉపయోగకరంగా తక్కువ ప్రీమియం గల పలు పథకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నగదు లావాదేవీలు చాలా సులభతరంగా చేయవచ్చని వెల్లడించారు. ఖాతాదారులు తాము ఉంటున్న గ్రామం నుంచే ఆధార్ కార్డు ద్వారా నగదును తీసుకోవచ్చని విశ్లేషించారు. బేటీ పడావో బేటీ బచావోలో భాగంగా పదేళ్ల లోపు బాలికలకు ఖాతాలను తెరవవచ్చని పేర్కొన్నారు. రూ.12 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమాను పొందవచ్చని తెలిపారు. రూ.330 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని వివరించారు.