వాహనాలతో రద్దీగా ఉండే రహదారులను.. పాదచారులు భద్రంగా దాటేందుకు 38 వంతెనలు..8 స్కైవేలను నిర్మించనున్నారు. వీటికి రూ. 239.55 కోట్ల అంచనాలతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రోడ్డు దాటుతున్న సందర్భంలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. వీటి నివారణకు జీహెచ్‌ఎంసీ వంతెనల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రద్దీ ప్రాంతాల్లో పాదచారుల కష్టాలు తీరనున్నాయి. ఇక భద్రంగా రోడ్డు దాటేయవచ్చు. నగరంలోని రద్దీ ఉన్న చోట 38 పాదచారుల వంతెనలు(ఎఫ్‌వోబీ), ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు. ఇందుకు రూ. 239.55 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 52 పాదచారుల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, ఇందులో 38కి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు, కొన్ని అంతకన్నా ముందే పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
స్కైవేలు..
1 ప్యాకేజీ-లో భాగంగా ఎల్‌బీనగర్ జోన్‌లో ఒకటి, ప్యాకేజీ-2లో చార్మినార్ జోన్‌లో ఒకటి, ప్యాకేజీ-3లో భాగంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో నాలుగు, ప్యాకేజీ-4లో భాగంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో రెండు స్కైవేలు కలిపి మొత్తం ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు. ఇందులో రూ. 12.96 కోట్లతో ఉప్పల్ రింగురోడ్డులో ఒకటి, రూ. 27.1కోట్లతో లక్డీకాపూల్, బంజారాహిల్స్ రోడ్ నెం-12, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిలకలగూడ రింగురోడ్డు (ఎస్కలేటర్‌తో), రూ. 11.9కోట్లతో ఆరాంఘర్, రూ. 18.2కోట్లతో సుచిత్ర జంక్షన్(ఎస్కలేటర్‌తో)లో ఒకటి, బోయిన్‌పల్లిలో(రెండు ఎస్కలేటర్‌తో) మరో స్కైవే నిర్మించనున్నారు.