రెవెన్యూ అక్రమాలపై విచారణ

అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భూ రికార్డుల ప్రక్షాళనపై అందిన ఫిర్యాదులకు సీసీఎల్‌ఏ (చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పందించారు. తక్షణమే విచారణ నిర్వహించి సమగ్ర నివేదికను పంపించాలని ఉత్తర్యులో పేర్కొన్నారు. సీసీఎల్‌ఏ ఆదేశాలతో అప్రమత్తమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే విచారణాధికారిని నియమించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గ మండలాలపై ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూ రికార్డుల ప్రక్షాళనలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదులు అందటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిగితే దాని పర్యవసనం ఎక్కడ వరకు వెళ్తుందోనని వణికిపోతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 


 


ఇక్కడ రైతులను జలగల్లా రక్తం పీల్చుకుని దోచుకున్న సొమ్ముతో ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అవినీతి అధికారులపై బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రికార్డుల ప్రక్షాళనను ఆసరా చేసుకుని కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సీసీఎల్‌ఏకు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఉన్న భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అర్హత లేని అనేక మందిని రైతులను చేసిన అవినీతి అధికారుల అక్రమ భాగోతాలకు ఆధారాలు సైతం అందజేసినట్లు తెలిసింది. విలువైన అస్సైన్డ్‌ భూములకు కొందరు అధికారులే బహిరంగంగా అమ్మేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ భూములు, గుడి మాన్యాలు, ఏజెన్సీలో అక్రమ భూ బదలాయింపులు ఇలా అన్ని పద్దతుల్లోనూ అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయి.