పాదయాత్రలు.. ప్రణాళికలు.




ఆదిలాబాద్‌ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులు కాలనీల్లో పాదయాత్రలు చేపట్టి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం తగిన చర్యలు చేపడుతున్నారు. రోజువారీగా వివిధ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. గురువారం నాల్గో రోజు కూడా పట్టణంలోని అన్ని వార్డుల్లో జోరుగా సాగింది. పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తదితరులు పరిశీలించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


కాలనీల్లో పండుగ వాతావరణం.. 


పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణంలోని 49 వార్డు ల్లో పండుగ వాతావరణం సంతరించుకున్నది. ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు, వార్డు ప్రజల పాదయాత్రలతో సందడిగా మారాయి. క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.  అప్పటికప్పుడే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీగా కార్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కల్టెర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజానీ, వార్డు కౌన్సిలర్లు పర్యవేక్షించారు. ఖాళీ  ప్రదేశాల్లో వెలసిన పిచ్చిమొక్కలు, పాడుబడ్డ బంగ్లాలను తొలిగించడానికి యజమానులకు నోటీసులు ఇచ్చారు. వంగిన కరెంట్‌ స్తంభాల తొలగింపు, కొత్త స్తంభాల ఏర్పాటు కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడో విద్యుత్‌ వైరు ఏర్పాటుకు విద్యుత్‌శాఖకు ప్రతిపాదనలు పంపారు. డ్రైనేజీల్లో పూడిక తీత వంటి కార్యక్రమాలను చేపట్టారు. మురికి నాళాలపై బ్లీజింగ్‌ పౌడర్‌ను చల్లారు. నీటికులాయిల లీకేజీలకు మరమతులు చేపట్టారు. పరిశుభ్రత, పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని సూచించారు. 


అందరి సహకారంతో.. 


అందరూ సహకరిస్తేనే పట్టణం ప్రగతి సాధిస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వార్డులో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. సమస్యలు తలెత్తకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.